Martyrs Memorial: తెల్లాపూర్‌లో అమరుల స్మృతి వనం
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:26 AM
తెలంగాణ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిన మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెల్లాపూర్‌లో అమరుల స్మృతి
పదెకరాల్లో ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిన మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెల్లాపూర్‌లో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. ఉద్యమ స్ఫూర్తిని చాటే విధంగా పది ఎకరాల్లో ఈ స్మారకాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మునిసిపాలిటీలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే సమీపంలో గల హెచ్‌ఎండీఏ స్థలంలో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి. గద్దర్ విగ్రహం నెలకొల్పిన స్థలానికి ఆనుకొని హెచ్‌ఎండీఏ భూములున్నాయి. అందులో ఖాళీగా ఉన్న పది ఎకరాల్లో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే వివిధ రకాల కళా ఖండాలు, మెదక్ జిల్లా విశిష్టతను చెప్పే అంశాలు, పచ్చిక బయళ్లు, ఆకట్టుకునే మొక్కలు, వాకింగ్ ట్రాక్ ఉండనున్నాయి.