Share News

CM Revanth Reddy: మావోయిస్టులు లొంగిపోవాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:37 AM

మావోయిస్టులు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు....

CM Revanth Reddy: మావోయిస్టులు లొంగిపోవాలి

  • జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

  • రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం తగ్గిపోయింది

  • పోలీసుల అజేయ స్ఫూర్తికిది నిదర్శనం

  • పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

  • కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి కోటి పరిహారం.. 300 గజాల ఇంటి స్థలం

  • ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

  • పోలీస్‌ అమరవీరులకు సీఎం నివాళి

  • ప్రజలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. నేరస్థులతో కాదు: డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు. ఇటీవల అనేక మంది అగ్రనేతలు లొంగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం గతంలో మావోయిస్టులు, తీవ్రవాద కార్యకలాపాలతో బాధపడిందని చెప్పారు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదం, నక్సల్స్‌ ప్రభావం వేగంగా తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని తెలిపారు. మంగళవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని, అమరులకు నివాళులు అర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నక్సల్స్‌ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని అభినందించారు. మావోయిస్టులు లొంగిపోయి, సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. ఎంతోమంది పోలీసులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం అని.. పగలు రాత్రి తేడాలేకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తారని తెలిపారు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారని సీఎం వెల్లడించారు. గ్రేహౌండ్స్‌ కమాండోలు టి.సందీప్‌, వి.శ్రీధర్‌, ఎన్‌.పవన్‌కల్యాణ్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ బానోతు జవహర్‌లాల్‌, నల్లగొండ కానిస్టేబుల్‌ బి.సైదులు, తాజాగా నిజామాబాద్‌లో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ఉన్నారని చెప్పారు.


ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. వీరమరణం పొందిన పోలీసులకు రాష్ట్ర ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. ప్రమోద్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.అదనంగా పోలీస్‌ సెక్యూరిటీ వెల్ఫేర్‌ నుంచి రూ.16 లక్షలు, పోలీస్‌ వెల్ఫేర్‌ నుంచి రూ.8 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రమోద్‌ కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అండగా ఉంటుందని చెప్పారు. 2008లో ఒడిసాలో మావోయిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీస్‌ అమరులకు గాజులరామారంలో 200 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌..

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు ప్రత్యేకమైన ప్రజా సంక్షేమ విధివిధానాలను అనుసరించడంలో తెలంగాణ పోలీస్‌ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇండియా జస్టిస్‌ రిపోర్టు ప్రకారం.. తెలంగాణ పోలీస్‌ శాఖ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. పారదర్శకత, పాస్‌పోర్టు తనిఖీల్లో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఈ విజయాలు రాష్ట్ర పోలీసుల నిరంతర కృషికి, అంకిత భావానికి నిదర్శనమని అన్నారు. పోలీస్‌ శాఖలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌ మహమ్మారిపై ఈగల్‌ (తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడం, సోషల్‌మీడియా ప్రభావం పెరగడంతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేలా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ సాధనే తమ లక్ష్యమని సీఎం వెల్లడించారు. సైబర్‌ నేరాలను అరికట్టడంలో సైబర్‌ క్రైమ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లు చేసి నేరస్థులను పట్టుకుంటున్న తీరు, పోలీసుల కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే 16,000 మంది కానిస్టేబుళ్లు, ఎస్సైలను నియమించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పోలీస్‌ విధులు, పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించామని అన్నారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు ఉద్యోగం, ఇంటిస్థలం, వారి పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ఉచిత విద్య, వైద్య కళాశాల్లో ప్రత్యేక సీట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

ప్రజలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్‌: డీజీపీ

పోలీస్‌ అంటే భయపెట్టేవాడు కాదని, భరోసా కల్పించేవాడని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధిత ప్రజలతోనే తప్ప.. నేరస్థులతో కాదని స్పష్టం చేశారు. పోలీస్‌ శాఖలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ప్రతి విభాగంలో సిబ్బంది అప్‌డేట్‌ అవ్వాలని సూచించారు. కాగా, మావోయిస్టులు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని నిజామాబాద్‌లో పిలుపునిచ్చారు. పోలీసుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవని హామీ ఇచ్చారు.

Updated Date - Oct 22 , 2025 | 06:51 AM