Fake Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం..
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:03 AM
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజే పలువురిని పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
15న విజయవాడలో అదుపులోకి..మరికొందరితో కలిపి హత్యచేసిన ఎస్‌ఐబీ పోలీసులు
టెక్ శంకర్ సహా మరికొందరినీ హత్య చేశారు
రేపు నిరసన దినం పాటించాలని మావోయిస్టుల పిలుపు
హైదరాబాద్/మంథని/చర్ల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజే పలువురిని పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఈనెల 15న విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరాయుధులైన హిడ్మా, రాజేతోపాటు మరికొందరిని కేంద్ర హోంశాఖ డైరెక్షన్‌లో ఏపీ ఎస్‌ఐబీ పోలీసులు పట్టుకున్నారు. హత్య చేసి మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ కట్టు కథ అల్లారు. ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించడం అబద్ధం. ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టెక్ శంకర్‌తోపాటు మరికొందరిని సైతం పట్టుకొని చంపి రంపచోడవరం ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగిందని కట్టు కథ అల్లారు. ఈ క్రూర హత్యలకు వ్యతిరేకంగా ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం’ అని పేర్కొన్నారు.