Maoist Party: దామోదర్ లొంగిపోవడం లేదు
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:10 AM
తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోతున్నారన్న వార్తల్లో నిజం లేదని, అదంతా పోలీసులు చేస్తున్న దుష్ప్రచారం అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

అదంతా పోలీసుల సృష్టి
మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదు
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
ఏటూరునాగారం/ చర్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోతున్నారన్న వార్తల్లో నిజం లేదని, అదంతా పోలీసులు చేస్తున్న దుష్ప్రచారం అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. దామోదర్ లొంగిపోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు బూటకమని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో జూన్ 26న మంత్రి సీతక్కపై వచ్చిన పత్రికా ప్రకటనకు తమ పార్టీకి సంబంధం లేదని జగన్ స్పష్టం చేశారు. కాగా, బీజాపూర్ జిల్లా జాతీయ అటవీ ప్రాంతంలో శనివారం కేంద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని తెలిపారు.