Maoist Internal Conflicts: మావోయిస్టుల చెరో మాట
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:41 AM
సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయిన సంక్లిష్ట సమయంలో మావోయిస్టుల్లో విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు ఆపరేషన్ కగార్.. అందులో పెద్దఎత్తున మావోయిస్టులు నేలరాలుతున్న కీలక సమయంలో పార్టీలో గందరగోళం నెలకొంది...
సంక్లిష్ట సమయంలో బయటపడిన విభేదాలు.. అభయ్ లేఖను తప్పుపట్టిన తెలంగాణ కమిటీ నేత జగన్
సాయుధ విరమణ ప్రకటన ఆయన సొంత అభిప్రాయం
దమనకాండ వేళ లేఖతో గందరగోళం
సాయుధ పోరాటంతో ముందుకెళ్లడమే తక్షణ కర్తవ్యం: జగన్
హైదరాబాద్/ చర్ల/అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయిన సంక్లిష్ట సమయంలో మావోయిస్టుల్లో విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు ఆపరేషన్ కగార్.. అందులో పెద్దఎత్తున మావోయిస్టులు నేలరాలుతున్న కీలక సమయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. ఆయుధాలు వదిలి వేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, అందుకు కొంత సమయం కావాలని పార్టీలో అగ్రనేతగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరిట ఆయన ఫొటోతో ఇటీవల లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఆగస్టు 15న రాసిన లేఖ సెప్టెంబరు 15న విడుదల చేయడం, గతానికి భిన్నంగా దానిపై వేణుగోపాలరావు తాజా ఫొటో ఉండడంతో అది పార్టీ రాసిన లేఖేనా అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ నిర్ణయం ఏ మాత్రం కాదని అందులో స్పష్టం చేశారు. ఈ రెండు పరిణామాలూ పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. నిజానికి, మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వడానికి పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని సోను తన లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా ‘చుట్టు ముట్టు, మట్టుబెట్టు’ అనే దాడులను ఎదుర్కొంటున్నామని, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, సహచరులు, ప్రజలను కోల్పోయామని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా 16 రాష్ట్రాల్లోని 150 జిల్లాల్లో పార్టీ నిర్మాణం జరుగుతూ వచ్చిందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పార్టీకి గుర్తింపు వచ్చిందని వివరించారు. వ్యూహాలు, ఎత్తుగడలతో ఉద్యమాన్ని విస్తరించామని తెలిపారు. పార్టీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. తప్పిదాలతో బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయామని, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా శత్రువుల బలాన్ని అంచనా వేయలేకపోయామని స్పష్టం చేశారు. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్, ఏవోబీ, ఒడిసా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్‌ల్లో ఉద్యమం దెబ్బతిందని, దండకారణ్యంలో పార్టీ నష్టపోవడానికి కొంత ఎక్కువ సమయం పట్టినా అంతిమంగా ఓటమి పాలయ్యామని వివరించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో అటువంటి ప్రకటనా!?
విప్లవోద్యమంతోపాటు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని, క్యాడర్‌ను నిర్మూలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీతో చర్చించకుండా సోను ప్రకటనను విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటి నుంచో పథకాలు వేసుకుని అమలు చేస్తోంది. ఆపరేషన్ కగార్ పేరిట భారీ స్థాయి యుద్ధ చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో కొంతమంది ప్రజాస్వామిక మేధావులు శాంతి చర్చల కమిటీగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రతిపాదించారు. తెలంగాణ, ఆంధ్రాలోని ప్రజా సంఘాలు, ప్రజలు ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలని ఆందోళన చేశారు. యుద్ధ కాండను నిలిపి వేయాలని దేశంలోని ఎందరో ప్రముఖులు కోరారు. అయినా, ఫాసిస్టు భావజాలంతో మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని నిర్మూలిస్తామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూనే ఉంది. కూంబింగ్, హత్యాకాండను ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలిపి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని కేంద్ర కమిటీ కూడా ప్రకటించింది. అయినా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సడలింపులు లేకుండా రక్తపుటేరులు పారిస్తూనే ఉంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి బాహాటంగా పదే పదే ప్రకటించారు. మరోవైపు, ఇటీవలి ఎన్‌కౌంటర్లలో అనేకమంది అమరులయ్యారు. అనారోగ్య సమస్యలతో పార్టీ అనుమతి తీసుకుని కొందరు సరెండర్ అయ్యారు. ఈ సమయంలో నెల రోజుల సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య’’ అని తప్పుబట్టారు. ఉద్యమాన్ని వదిలి జన జీవన స్రవంతిలో కలిసి చట్టబద్ధంగా పని చేయాలని అనుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చని, తన అభిప్రాయాన్ని పార్టీ చానల్‌లో పంపించినప్పుడు ఆయన ప్రశ్నలకు జవాబులు దొరికేవని సూచించారు. అది చేయకపోగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణులు, విప్లవ శిబిరంలో గందరగోళం తలెత్తుతుందని, సోను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగపడకపోగా నష్టం చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని ఏ పార్టీ కూడా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని చూడదని, అటువంటిది తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న సమయంలో రహస్య, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీలో సరిగ్గా ఆలోచించే వాళ్లు ఇలా చేయరని తప్పుబట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యపై పార్టీలో పై నుంచి కింది వరకు ప్రస్తుతం అంతా తీవ్రంగానే ఆలోచిస్తున్నారని, అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడం లేదని వివరించారు. బహిరంగ ప్రకటనలతో ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం కాదని జగన్ స్పష్టం చేశారు. భయంకరమైన దమనకాండలో జరుగుతున్న న ష్టాలను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమస్యకు ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరక్క పోవచ్చునని, గత ఏడాది పొలిట్‌బ్యూరో విడుదల చేసిన ఉత్తర్వు (సాయుధ పోరాటంతోనే ముందుకు)ను అమలు చేయడమే తక్షణ కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. అభయ్ పేరిట వచ్చింది అధికారిక ప్రకటన కాదని, విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దానిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదని, ఫాసిస్టు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను తీవ్రతరం చేయాలని కోరారు.
అభయ్ ఎక్కడ!?
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఎక్కడ? ఆయన దండకారణ్యంలో ఉన్నారా? లేక భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? పార్టీ పద్ధతులు, విధానాలకు పూర్తి విరుద్ధంగా ఆయన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇది. కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ) సోదరుడైన వేణుగోపాలరావు కొంతకాలంగా పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి, బస్వరాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోలేదు. పొలిట్‌బ్యూరో సమావేశం జరగలేదు. కనీసం కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు. అలాంటప్పుడు, సాయుధ పోరాట విమరణ ప్రకటన ఎలా చేశారనే సందేహాలను మావోయిస్టు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉనికిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోను భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? వారి ఆదేశాల మేరకే ప్రకటన విడుదల చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రకటనల్లో ఎప్పుడూ అధికార ప్రతినిధులు, నేతల ఫొటోలు ఉండవు. కానీ, సోను యూనిఫామ్‌లో ఉన్న స్పష్టమైన ఫొటోను ప్రకటనకు జత చేశారు. పోలీసుల వద్ద ఆయనకు సంబంధించి 1986 నాటి ఫొటో మాత్రమే ఉంది. దాంతో, ఇదంతా పోలీసుల ఎత్తుగడలో భాగంగానే జరిగి ఉంటుందని పార్టీ, ప్రజా సంఘాల నేతలు అనుమానిస్తున్నారు.
అది బస్వరాజ్ ఉన్నప్పటి నిర్ణయమే
సాయుధ పోరాట విరమణ ప్రకటనకు, సోను ఉనికికి సంబంధం ఉండదని కీలక ప్రజాసంఘం నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ‘‘అభయ్ ప్రకటనలో కీలక అంశాలున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బస్వరాజ్ ఉన్న సమయంలోనే శాంతి చర్చలపై కీలక చర్చ జరిగిందని రాశారు. ఆయన ప్రారంభించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంటే, ఇది తన సొంత నిర్ణయం కాదని అభయ్ స్పష్టం చేశారు. బస్వరాజ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 2024 సెప్టెంబరు, 2025, ఫిబ్రవరిలో రెండు కీలక సమావేశాలు జరిగాయి. అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. కేడర్, నాయకత్వాన్ని కాపాడుకునేందుకు కేంద్రంతో శాంతి చర్చలకు వెళ్లాల్సిందేనని, అవసరమైతే కొంత కాలంపాటు సాయుధ పోరాట విమరణకు ఒప్పుకొందామని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాది మే 10న అభయ్ పేరిట స్వయంగా బస్వరాజ్‌నే ప్రకటన విడుదల చేశారు కూడా’’ అని ఆయన వివరించారు. అభయ్ పోలీసుల అదుపులో లేరని తాము కచ్చితంగా చెప్పగలమని తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో కీలక ప్రజాసంఘం నేత చెబుతున్నారు. సాయుధ పోరాట విరమణ ప్రకటనకు ముందే.. ఆగస్టులోనే సోను పేరిట కేడర్‌కు ఓ అంతర్గత లేఖ వచ్చిందని, సాయుధ పోరాట విరమణను పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని, పోరాటం మరో రూపంలో ఉంటుందని, లేఖను అపరాధ భావనతో రాస్తున్నట్లుగా అందులో ఆయన పేర్కొన్నారని వివరించారు.
కేంద్ర మంత్రితో చర్చలకు రాయబారం
కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మావోయిస్టు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్‌కౌంటర్‌కు ముందు రెండు దఫాలుగా ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్‌లోని బీజేపీ నేతల ద్వారా ప్రయత్నించారని తెలిసింది. బస్వరాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత కూడా మరికొన్ని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దక్షిణాదికే చెందిన కీలక కేంద్ర మంత్రి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. సదరు మంత్రి నేరుగా అమిత్ షాను కలిసి మావోయిస్టుల ప్రతిపాదనలను వివరించినట్లు సమాచారం. దాంతో, శాంతి చర్చలకు అవకాశమే లేదని, అయితే, ఆయుధాలతో సహా సరెండర్ కావాలని, లేదంటే బలగాలను ఎదుర్కోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో, తాము కోరుకున్నట్లుగా చర్చలు జరిగే అవకాశం లేదని మావోయిస్టులకు అర్థమైంది. ఆ తర్వాతే సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చి ఉంటుంద ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.