Share News

Jagga Reddy: రాహుల్‌ను ప్రధానిని చేసి ఉక్కును రక్షించుకోండి

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:20 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)పిలుపిచ్చారు.

Jagga Reddy: రాహుల్‌ను ప్రధానిని చేసి ఉక్కును రక్షించుకోండి

  • స్టీల్‌ప్లాంటును మోదీ క్యాన్సర్‌ రోగిలా చిత్రీకరిస్తున్నారు

  • మాజీ సీఎంగా జగన్‌ మళ్లీ కార్మికులను మోసం చేస్తున్నారు

  • ‘విభజన’ చేశారనే ఏపీ ప్రజలు కాంగ్రె్‌సను నామరూపాల్లేకుండా చేశారు

  • సాగునీటి ప్రాజెక్టులపై నాడు కేసీఆర్‌-జగన్‌ విందు భోజనాలు

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)పిలుపిచ్చారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 20 మంది లోక్‌సభ సభ్యులను గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని, స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షిస్తారని వెల్లడించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ 1966లో రూ.14,000 కోట్లతో స్థాపించిన స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుత సంపద దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్లకు చేరిందని జగ్గారెడ్డి చెప్పారు. అత్యంత విలువైన స్టీల్‌ ప్లాంటు సంపదను తన వారికి అప్పగించుకోవాలన్న దురుద్దేశంతోనే.. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును క్రమంగా మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. స్టీల్‌ ప్లాంటును నయం చేయలేని దశలో ఉన్న క్యాన్సర్‌ రోగిలా మోదీ చిత్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మళ్లీ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులను మోసం చేస్తున్నారన్నారు.


రాహుల్‌ ప్రధాని అయితే.. మోదీ, జగన్‌, చంద్రబాబు, పవన్‌ నాటకాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చేసిందన్న ఒకే ఒక్క కారణంతో సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ సమయంలో రాష్ట్ర విభజనకు మద్దతుగా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు రాశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తానొక్కడినే సమైక్యాంధ్రకు మద్దతుగా అధిష్ఠానానికి లేఖలు రాశానని, బాహాటంగా మాట్లాడానని వెల్లడించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు తనకే ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంఽధించి గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జగన్‌ పరస్పరం విందుభోజనాలు చేసుకున్నా.. నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సీఎంల మధ్య ఇలాంటి విందు రాజకీయాలు నడవవని, నీటి సమస్యపై ఇరువురూ చర్చించుకుని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 04:21 AM