Share News

సీఐని బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:55 AM

క్రైమ్‌ మిర్రర్‌ డిజిటల్‌ పేపర్‌ ముసుగులో వసూళ్లకు పాల్పడిన ప్రధాన నిందితుడు ఆనంద్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐని బెదిరించిన కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

నల్లగొండ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): క్రైమ్‌ మిర్రర్‌ డిజిటల్‌ పేపర్‌ ముసుగులో వసూళ్లకు పాల్పడిన ప్రధాన నిందితుడు ఆనంద్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు కేసు వివరాలు వెల్లడించారు. నాగుల ఆనంద్‌కుమార్‌ అలియాస్‌ ఆనంద్‌ క్రైమ్‌ మిర్రర్‌ ఈ - న్యూస్‌ పేపర్‌- స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోగా చలామణి అవుతున్నాడు. ప్రభుత్వ అధికారులపై తప్పుడు, అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ వారిని బెదిరింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ కేసులో తుప్పరి రఘు, పెరబోయిన ఆంజనేయులు అలియాస్‌ అంజిని ఈ నెల 2న తేదీన మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. నాగుల ఆనంద్‌కుమార్‌ తనకు పరిచయమైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు అలియాస్‌ అంజి సహకారంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. నల్లగొండ జిల్లా, వికారాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో కూడా కొందరు ప్రభు త్వ ఉద్యోగులు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు, కల్పిత సమాచారంతో కైరమ్‌ మిర్రర్‌ డిజిటల్‌ పత్రికలో ప్రచురించే వారని డీఎస్పీ తెలిపారు. గతంలో నల్లగొండ జిల్లా హెడ్‌క్వార్టర్‌ డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన కొంపల్లి మత్స్యగిరి, పారా మెడికల్‌ యూనియన్‌లో వారి డిపార్ట్మెంట్‌ సమస్యల పరిష్కారానికి చురుకుగా పనిచేస్తున్నాడని, అతనిని తమ లక్ష్యంగా ఎంచుకొని 27జూలై 2024న డీఎంహెచ్‌వో ఆఫీసు సిబ్బంది పైన పరోక్షంగా మత్స్యగిరి పైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అర్థం వచ్చే విధంగా ‘ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపీ’ అనే శీర్షికతో క్రైమ్‌ మిర్రర్‌ పేపర్‌లో ప్రచురించి, సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ చేశారు. తర్వాత సదరు మత్స్యగిరిని వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా అతనిని సంప్రదించి, రూ. 4లక్షలు ఇవ్వాలని, లేదంటే పేరు బహిర్గతం చేస్తామని, లేనిపక్షంలో క్రైమ్‌ మిర్రర్‌ డిజిటల్‌ పేపర్‌లో స్టోరీలు రాస్తామని, లేదంటే నీ అంతు చూస్తామని మని బెదిరించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బాధితుడు భయపడి అక్టోబరు 1వ తేదీ 2024న రూ.50వేలు గూగుల్‌ పే ద్వారా పంపించాడు. మళ్లీ బెదిరిస్తే మరో రూ.40వేలు ఇచ్చాడు. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిబ్రవరి 2వ తేదీ 2025న బాధితుడు నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి, సాక్ష్యాధారాలు సేకరించి, మంగళవారం ప్రధాన నిందితుడు నాగుల ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి, సెల్‌ఫోన్‌ స్వా ధీనం చేసుకొని రిమాండ్‌కు పంపారు. మిగతా ఇద్దరు నేరస్థులు మిర్యాల గూడ రూరల్‌ సీఐ వీరబాబును కూడా ఇదే విధంగా వేధించి, భయపెట్టి రూ.2లక్షలు డిమాండ్‌ చేసిన కేసుకు సంబంధించి మిర్యాలగూడ టూ టౌన్‌లో నమోదైన కేసులో ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. మిగితా బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 12 , 2025 | 12:55 AM