Mahesh Kumar Goud: దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడు
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:58 AM
కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలూడదీసి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ హెచ్చరించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మహే్‌షకుమార్ గౌడ్
బీఆర్‌ఎ్‌సలో పోకిరీ ఎమ్మెల్యేలు..
గవర్నర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు
క్షమాపణలు చెప్పాలి: పీసీసీ చీఫ్
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలూడదీసి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ హెచ్చరించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని కేటీఆర్‌కు హితవు పలికారు. బుధవారం మహే్‌షకుమార్ గౌడ్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సలో పోకిరి ఎమ్మెల్యేలు ఉన్నారని, గవర్నర్ ప్రసంగించేప్పుడు ఎలా ఉండాలో తెలియదా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చిన్నపిల్లాడిలా వ్యాఖ్యలు చేశారని, గవర్నర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. గవర్నర్‌కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన సన్నాసులు ఎవరో కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండేదని, ఈ విషయంపై మాట్లాడడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సేవాదళ్ కీలక పాత్ర పోషించిందని మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా భవన్‌లో సేవాదళ్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మాట్లాడారు. సేవాదళ్ కమిటీలను జిల్లాల వారీగా నియమించనున్నట్లు తెలిపారు.
కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో: బల్మూరి
పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాళ్లతో తరిమికొట్టే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. ఎవరికి పిచ్చి ముదిరిందో, ఎవరు అసెంబ్లీకి రాకుండా ఫాంహౌ్‌సకు పరిమితమై పడుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.