కొనసాగాలంటే చదవాల్సిందే!
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:13 PM
ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త ఆందోళన వచ్చి పడింది. గతంలో టెట్ రాయకుండా టీచర్లుగా ఎంపికైన వారు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉంటే కచ్చితంగా టెట్ రాయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు టెట్ పాస్‌కావాల్సిందే
రెండేళ్ల వ్యవధిలో పాస్ కాకుంటే ఇంటికే..
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనన్న ఎన్‌సీటీఈ
ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు ఉద్యోగోన్నతి పొందాలన్నా వర్తింపు
ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లకంటే పైబడి సర్వీసు టీచర్లు 3,422 మంది
చేసేది లేక పుస్తకాలతో కుస్తీ
మహబూబ్‌నగర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త ఆందోళన వచ్చి పడింది. గతంలో టెట్ రాయకుండా టీచర్లుగా ఎంపికైన వారు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉంటే కచ్చితంగా టెట్ రాయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులపై ఉపాధ్యాయులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యూకేషన్ (ఎన్‌సీటీఈ)కి విన్నవించారు. అందుకు ఎన్‌సీటీఈ స్పందిస్తూ, టీచర్లు కచ్చితంగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనని మంగళవారం బదులివ్వడంతో ఉపాధ్యాయుల ఆఖరి ఆశలు కూడా గల్లంతయ్యాయి. దీంతో వృత్తిలో కొనసాగాలంటే చదవాల్సిందేనని పుస్తకాలు కొని తెచ్చుకుని మరీ కుస్తీ పడుతున్నారు.
ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో ఆందోళన
ప్రభుత్వం రెండేళ్ల కాలవ్యవధిలో నాలుగుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహిస్తోంది. గతంలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరిస్తోంది. ఆఫ్‌లైన్ విధానంలో వేరే వారిని పెట్టి పరీక్ష రాయిస్తున్నారనే ఆరోపణలతో ఆన్‌లైన్ చేశారు. ఆరు నెలలకు ఒక టెట్ చొప్పున నాలుగు టెట్‌లలో ఏదో ఒకదానిలో క్వాలిఫై కావాల్సి ఉంది. ఇది విద్యార్థుల పనితీరు మెరుగుదల, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించగా.. ఎన్‌సీటీఈ కూడా సమర్థిస్తోంది. ఒకవేళ రెండేళ్లలో టెట్ క్వాలిఫై కానిపక్షంలో ఆ ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగే అవకాశం లేదు. ఉద్యోగ విరమణ లేదా టర్మినల్ బెనిఫిట్స్ తీసుకుని ఉద్యోగం నుంచి వైదొలాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే నిత్యం పాఠశాలలకు వెళ్లి.. పాఠాలు చెప్పేవారు ఇదే వృత్తిగా ఉన్నవారు సులభంగా క్వాలిఫై అవుతారని, కానీ ఉపాధ్యాయ వృత్తి కాకుండా ఇతర వ్యాపారాలు, ఫైనాన్స్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించేవారు మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాక 14,070 పోస్టులు మంజూరు
ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాల్లో కలిపి ఉపాధ్యాయ పోస్టులు 14,070 మంజూరు ఉన్నాయి. ప్రస్తుతం 13,130 మంది పని చేస్తున్నారు. 2010 తర్వాత నుంచి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో టెట్ నిర్వహిస్తున్నారు. అంతకుముందు టెట్ లేకుండా టీచర్‌గా ఎంపికైన వారు జిల్లాలో 6,738 మంది ఉన్నారు. మిగతా 6,392 మంది 2010 తర్వాత వివిధ సందర్భాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి.. పాసయ్యారు. అయితే ఎన్‌సీటీఈ 2010లో అంతకుముందు ఎంపికైన టీచర్లకు టెట్‌లో మినహాయింపు ఇచ్చింది. కానీ 2017లో వారికీ టెట్ కావాలని పార్లమెంట్‌లో చట్టం చేశారు. దీన్ని ఈ సంవత్సరం తీర్పు సందర్భంగా సుప్రీం సమర్తిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఐదేళ్ల సర్వీసు ఉన్న వారు 3,422 మంది
ఉమ్మడి జిల్లాలో టెట్ రాయకుండా టీచర్లుగా ఎంపికైన వారు 6,392 మంది ఉన్నారు. అందులో 2,970 మంది ఐదేళ్ల కంటే సర్వీసు తక్కువ ఉన్నవారు ఉండగా, మిగతా 3,422 మంది ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు ఉన్నారు. ఈ 3,422 మంది కచ్చితంగా టెట్ పాస్ కావాల్సి ఉంది. లేకపోతే కంపల్సరీ రిటైర్‌మెంట్ తీసుకోవాలి. లేదంటే టర్నినల్ బెనిఫిట్స్ తీసుకుని ఇంటికి వెళ్లాలి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశాయి. తాజాగా ఎన్‌సీటీఈ కూడా ఈ డిమాండ్లపై ఏకీభవించకపోవడం గమనార్హం.
పదోన్నతికీ అవసరమే..
ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సి ఉండగా, ఐదేళ్లలోపు ఉన్న వారికి ఆ అవసరం లేదు. అదే సమయంలో మిగిలిన ఐదేళ్లలో ఉద్యోగోన్నతి పొందాలంటే మాత్రం కచ్చితంగా టెట్ కావాల్సిందే. ఈ విషయంపై చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు అనుభవం ముఖ్యమని.. టెట్ వల్ల తమ సీనియారిటీని ప్రశ్నిస్తున్నట్లు ఉందని అంటున్నారు. ఆరోగ్యం, వయసు, చదివే ఓపిక రీత్యా.. ఈ కాలం పిల్లలతోపాటుగా పరీక్షలు రాయాల్సి వస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఇప్పటికే తమ పనిని ప్రారంభించగా.. మరికొందరు నేటి నుంచి టెట్ కోసం చదవాల్సి వస్తుందని చెబుతున్నారు. రోజూ చెప్పే పాఠాలే అయినప్పటికీ.. ఇప్పుడు పరీక్షలకు సన్నద్ధం కావడం విచిత్రంగా ఉందని మరికొందరు పెదవి విరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విధానం వల్ల టీచర్ల పనితీరు మెరుగుపడుతుందని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను సమర్థులుగా తయారు చేసేందుకు ఈ సన్నద్ధత ఉపయోగపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాణ్యమైన బోధనే లక్ష్యంగా తెచ్చిన ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు.