Share News

పురుగుల అన్నం.. నీళ్లచారు మాకొద్దు

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:30 PM

పురుగుల అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా ఉంటోందని, ఉపాధ్యాయులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

పురుగుల అన్నం.. నీళ్లచారు మాకొద్దు
వంట ఏజెన్సీ వారితో మాట్లాడుతున్న విద్యార్థులు

మహమ్మదాబాద్‌ జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థుల ఆందోళన

మహమ్మదాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పురుగుల అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా ఉంటోందని, ఉపాధ్యాయులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో నెల కిందట అధ్వాన్నంగా మధ్యాహ్న భోజనం అన్న శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. కథనం వచ్చిన వారం పాటు నాణ్యమైన భోజనం అందించారని, ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చారని విద్యార్థులు తెలిపారు. భోజనం బాగోలేక ఇళ్లకు వెళ్లి తింటున్నామని చెప్పారు. బుఽధవారం భోజనంలో పురుగులు, మట్టిపెడ్డలు రావడంతో వంట ఏజెన్సీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో ర్యాలీ గా వెళ్లి, మహబూబ్‌నగర్‌-చించోలి 167 జాతీయ రహదారిపై బైఠాయించారు. డీఈవో, కలెక్టర్‌ వచ్చి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. పోలీసులు, ఎంఈవో రాజు నాయక్‌ విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయమై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో మాట్లాడగా, విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరతామని చెప్పారు.

Updated Date - Dec 02 , 2025 | 11:30 PM