మహిళల అభ్యున్నతికి కృషి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:28 PM
మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
- బాల్య వివాహాలను అరికట్టాలి
- ఎస్‌పీ రావుల గిరిధర్
వనపర్తి రాజీవ్ చౌరస్తా, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ‘మన కోసం - మన పిల్లల కోసం’ నినాదంతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధే లక్ష్యంగా యూనిసెఫ్ సహకారంతో, సెర్ప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ‘స్నేహ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్య వివాహం చేస్తే కుటుంబ సభ్యులతో పాటు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పోక్సో కేసుపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన స్కిట్ అందరినీ ఆకట్టుకున్నది. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు, డీఆర్డీవో ఉమాదేవి, డీడబ్ల్యూవో సుధారాణి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అంజయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు.