Share News

దళారుల ప్రమేయం లేకుండా.. ప్రభుత్వ పథకాలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:46 PM

దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

   దళారుల ప్రమేయం లేకుండా..  ప్రభుత్వ పథకాలు
లబ్ధిదారుకు పట్టా ఇస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

- లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ

- డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఆక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) :దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలానికి చెందిన చౌదర్‌పల్లి, మాచన్‌పల్లి తండా, ఫతేపూర్‌, ఓబ్లాయిపల్లి, కోడూర్‌, మాచన్‌పల్లి గ్రామాల్లో నిర్మించిన 180 డబుల్‌ బెడ్‌రూంలను అర్హులైన పేదలకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసి, వారికి ఇళ్ల పట్టాలు అందించి, మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10 ఏళ్లలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సీఎంను ఒప్పించి రూ.9 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసుతులు కల్పించడం జరిగిందన్నారు. అర్హుల జాబితాలో ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేదన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దోహదపడిందన్నారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో మరో 3,500 ఇళ్లు వస్తాయన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహ్మరెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ ఇవాంజిలీన్‌, హౌజింగ్‌ పీడీ వైద్యం భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో కరుణశ్రీరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, రాంచంద్రయ్య, పండరయ్య, గోవింద్‌ యాదవ్‌, మైబు, ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, నరేష్‌, రవిందర్‌, జి.ఆంజనేయులు, రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:46 PM