Share News

రైతులకు బేడీలు వేస్తారా?

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:08 PM

ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి దొంగలు, బందిపోట్ల మాదిరి బేడీలు వేస్తారా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతులకు బేడీలు వేస్తారా?
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జైలు నుంచి విడుదలైన రాజోలి మండలం పెద్ద ధన్వాడ రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

- అక్రమ కేసులను ఎత్తివేయాలి

- ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలి

- మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి దొంగలు, బందిపోట్ల మాదిరి బేడీలు వేస్తారా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జోగుళాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడకు చెందిన 12 మంది రైతులు జిల్లా కేంద్రంలోని జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వారిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అలంపూర్‌ ప్రాంతంలో తుమ్మిళ్ల ప్రాజెక్టును నిర్మించి రైతులకు భూములు కొనిచ్చామని గుర్తు చేశారు. ఆ ప్రాంతానికి కర్నూలు, రాయిచూరుల నుంచి ప్రజలు వలసలు వచ్చేలా చేశామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ భూములను నాశనం చేసే పరిశ్రమలను తీసుకొస్తోందని విమర్శించారు. ఇథనాల్‌ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విధుల్లో ఉన్న నాగర్‌కర్నూల్‌ జైలర్‌ ఈ ఊరికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపైనా కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని, ఇలాంటి కేసులకు భయపడదన్నారు. నడిగడ్డ బిడ్డలు అసలు భయపడరని, రైతులకు అందరూ అండగా ఉంటారని చెప్పారు. ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేసి, రైతులపై కేసులను ఎత్తివేసేవరకు బీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం, అధికారుల తీరు ఇదే మాదిరిగా ఉంటే ఆ 12 గ్రామాలకు 1200 గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కేసీ నరసింహులు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు శివరాజు, నాయకులు నవకాంత్‌, పాల సతీశ్‌ ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:08 PM