మంత్రి పర్యటనతో సమస్యలు పరిష్కారమయ్యేనా?
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:21 PM
జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల రోపులు పరిశీలించేందుకు శనివారం రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిలు గద్వాలకు వచ్చారు.
- జూరాల ప్రాజెక్టు పూడికతీతతో పూర్వవైభవానికి హామీ
- నాలుగేళ్లుగా 2టీఎంసీలకే ర్యాలంపాడు పరిమితం
- నెట్టెంపాడు వ్యయం అంచనాల పెంపుతో పూర్తయ్యేనా?
- ఆశలు రేకెత్తించిన మంత్రి ఉత్తమ్ కుమార్
గద్వాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల రోపులు పరిశీలించేందుకు శనివారం రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిలు గద్వాలకు వచ్చారు. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడు రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రులు గద్వాల కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. అనేక హామీలు ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు పూర్వవైభవం తీసుకవస్తామని హామీ ఇచ్చారు. జూరాల ప్రాజెక్టులో ఆపరేషన్ మెయింటనెన్స్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేదని అందుకే ప్రాజెక్టులో రోప్స్ పాడైపోవడం, గ్యాంటీ క్రేన్ పనిచేయకపోవడం వంటివి జరిగాయని చెప్పారు. తాము పక్కాగా నిర్వహణ చేస్తామని గేట్ల మరమ్మతులు పదిరోజుల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.3.50కోట్లతో మరో కొత్త గ్యాంటీ క్రేన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ప్రాజెక్టుపై భారీ వాహనాలు వెళ్లకూడదని నిపుణుల కమిటీ నివేదించిందని గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేయలేదని అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో జూరాల కింద కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఇచ్చిన హామీ నెరవేరితే గద్వాల, ఆత్మకూర్, అమరచింత మధ్య వ్యాపార సంబంధాలు పెరిగి అభివృద్ధి చెందుతాయని ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నెట్టెంపాడు, తుమ్మిళ్లపై మంత్రి హామీలు అమలు అయి తే నడిగడ్డ సస్యశ్యామలం అవుతుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ గట్టు ఎత్తిపోతల పథకం పనుల పర్యవేక్షణకు వచ్చి ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలను అరికట్టి 4టీఎంసీలు నిల్వ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఖరీఫ్ నాటికి లీకేజీలు అరికట్టాల్సి ఉండగా కాలయాపన జరిగింది. మళ్లీ మంత్రి ఇప్పుడు 4టీఎంసీలు నీల్వచేసేందుకు సీడబ్లూ సీ లాంటి సంస్థతో సర్వే చేస్తున్నామని ఎంత ఖర్చు అయిన 4టీఎంసీల నిల్వ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ వచ్చే ఖరీఫ్ నాటికైన పూర్తయితే చాలని రైతులు కోరుతున్నారు. నెట్టెంపాడులో 90శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా పదిశాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికోసం నెట్టెంపాడుపై రూ.2753కోట్లతో రివైజ్‌డ్ అంచనాలు తయారు చేశామని, డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామ ని హామీ ఇచ్చారు. దీని ద్వారనైనా పెండింగ్ కాలువల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు అంటున్నా రు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూ పరిపాలన అనుమతులు ఉన్నప్పటికీ భూసేకరణ జరగలేదు. రైతులు అడ్డుకుంటున్నారు. అయితే మంత్రి త్వరలో భూసేకరణ పూ ర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది నెరవేరితే ఆర్డీయస్‌లో చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. అయితే మంత్రి ఇచ్చిన హామీలు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తయితే నడిగడ్డలో సాగునీటి సమస్యలు తీరుతాయని, ఏదో వచ్చాము.. చెప్పాము అనిపోతే కథ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు.