Share News

నాలుగో యూనిట్‌ రెడీ అయ్యేనా?

ABN , Publish Date - Mar 17 , 2025 | 10:41 PM

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన నాలుగో యూనిట్‌ ప్రారంభమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మరమ్మతులు చేపట్టినా, కొద్ది రోజుల్లోనే మళ్లీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది.

నాలుగో యూనిట్‌ రెడీ అయ్యేనా?
షాట్‌సర్క్యూట్‌తో కాలిపోయిన శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌ (ఇన్‌సెట్లో)స్టేటార్‌ బార్స్‌

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం అగ్ని ప్రమాదంలో రూ.100 కోట్ల నష్టం

నాలుగో యూనిట్‌ను మరమ్మతు చేసిన వాయిత్‌ కంపెనీ

ప్రారంభ మైన 19 రోజులకే మరోసారి మంటలు

కంపెనీ లైసెన్స్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టిన జెన్‌కో యాజమాన్యం

మరోసారి అదే కంపెనీకి పనుల అప్పగింత ఫ ఏప్రిల్‌ వరకు గడువు

మరమ్మతు కోసం వారం కిందట యూనిట్‌ను పరిశీలించిన కంపెనీ

అవసరమైన స్టేటార్‌ వైన్డింగ్‌ కండక్టర్స్‌ కోసం చైనాలో ఆర్డర్‌

దోమలపెంట, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన నాలుగో యూనిట్‌ ప్రారంభమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం తర్వాత మరమ్మతులు చేపట్టినా, కొద్ది రోజుల్లోనే మళ్లీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో మళ్లీ మరమ్మతులు చేపడుతున్నారు. భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పాదన చేస్తూనే, రాత్రి వేళ బ్యాటరీలు మార్చుతుండగా 2020 ఆగస్టు 20న షాట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. నైట్‌ డ్యూటీలో ఉన్న ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్‌ అసిస్టెంట్లు, మరో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన అమర్‌ రాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు విద్యుత్‌ కేంద్రాన్ని ఎలాగైనా రక్షించాలని చివరి వరకు పోరాడి ప్రాణాలు వదిలారు. ప్రమాదంలో 4వ యూనిట్‌ పూర్తిగా కాలిపోగా, మిగతా యూనిట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో దాదాపు రూ.100 కోట్ల నష్టం జరిగిందని, ఇద్దరు సీఈల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని అప్పటి ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ నివేదికలు అందాయి. బాధ్యులైన అధికారులుపై చర్యలు తీసుకుంటామని జెన్‌కో యాజమాన్యం వెల్లడించింది. కానీ, ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. ఏడాది క్రితం అధికారం చేపట్టిన కొత్తలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపో యింది.

బ్లాక్‌ లిస్టులో పెట్టిన కంపెనీకి మరోసారి పనులు

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన నాలుగో యూనిట్‌ మరమ్మతు పనులు చేపట్టేందుకు ఢిల్లీకి చెందిన వాయిత్‌ కంపెనీ రూ.14,93,41,271లకు టెండరు దక్కించుకున్నది. 2021 సెప్టెంబరులో పనులు ప్రారంభించి, 2023 జూలై చివరి నాటికి పూర్తి చేసి, జెన్‌కోకు అప్పగించారు. 2023 జూలై 17న 4వ యూనిట్‌ను రన్‌ చేసి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 19 రోజుల్లో 70 గంటల వ్యవధిలో 11.6029 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 2023 ఆగస్టు 17న స్టేటార్‌ వైండింగ్‌ బార్స్‌లో షాట్‌సర్క్యూట్‌ కావడంతో మరోసారి మంటలు చెలరేగాయి. యూనిట్‌ కాలిపోయి, పని చేయడం లేదు. సదరు కాంట్రాక్టు సంస్థ జెన్‌కో సంస్థ సక్రమంగా రన్‌ చేయకపోవడంతోనే షాట్‌సర్క్యూట్‌ అయ్యిందని తప్పించుకునే ప్రయత్నం చేసింది. జెన్‌ యాజమాన్యం నిపుణుల కమిటీతో విచారణ చేయించగా మరమ్మతు పనులలో నాసిరకం మెటీరియల్‌ వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదిక ఇచ్చింది. దీంతో వాయిత్‌ కంపెనీ కాంట్రాక్టు లైసెన్స్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు జెన్‌కో యాజమాన్యం ప్రకటించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నాలుగో యూనిట్‌ మరమ్మతు పనులను పూర్తి చేసి, ఈ ఏడాది సీజన్‌ నాటికి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా బ్లాక్‌ లిస్టులో చేర్చిన వాయిత్‌ కంపెనీకే మరోసారి పనులు అప్పగించడంలో ఆంతర్యమేమిటని ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూనిట్‌ పనులను నాణ్యతగా చేయకపోతే మునుముందు మరో ప్రమాదం జరుగుతుందేమోనని భూగర్భ విద్యుత్‌ కేంద్రం జెన్‌కో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.

పనులు పూర్తి చేయాలని జెన్‌కో యాజమాన్యం ఒత్తిడి

ఏడాదిన్నర క్రితం కాలిపోయిన 4వ యూనిట్‌కు మరమ్మతు పూర్తి చేసి, అప్పగించాలని వాయిత్‌ కంపెనీతో అగ్రిమెంట్‌ ఉంది. ఈ విషయ మై జెన్‌కో యాజమాన్యం కంపెనీపై ఒత్తిడి చేయగా, తమకు అదనంగా నిధులు కేటాయిస్తే తప్ప పనులు చేయలేమని మెండికేయడంతో చేసేదేమీలేక అదనంగా రూ.1.30 కోట్లు ఇచ్చేందుకు జెన్‌కో యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారం కిందట వాయిత్‌ కంపెనీ బృందం నాలుగో యూ నిట్‌లో మరమ్మతులు చేపట్టేందుకు పరిశీలించినట్లు తెలిసింది. అవసరమైన స్టేటార్‌ వైన్డింగ్‌ కండక్టర్స్‌ కోసం చైనాలో ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం. అవి రాగానే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టం

విద్యుత్‌ కేంద్రంలో 2020లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వల్ల నాలుగో యూనిట్‌ పూర్తిగా కాలిపోయి, నాలుగేళ్లుగా విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వానికి భారీగానే ఆర్థిక నష్టం జరిగినట్లు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ప్రతీ ఏడాది వానాకాలంలో 120 రోజులు విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తారు. ఒక్క యూనిట్‌ 24 గంటలు విద్యుత్‌ ఉత్పాదన కొనసాగిస్తే రోజుకు సుమారు 36 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. నాలుగు సంవత్సరాలుగా విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోవడంతో 172 కోట్లా 80 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రైవేట్‌ రంగ విద్యుత్‌ సంస్థలతో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు యూనిట్‌కు రూ.5 వరకు చెల్లిస్తుంది. ఈవిధంగా లెక్కిస్తే సూమారు రూ.864 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పుకోవచ్చు, నాలుగో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి జరిగి ఉంటే ప్రభుత్వ పరంగా పేదలకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌ పథకానికి ఇబ్బంది ఉండేది కాదని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 10:41 PM