Share News

నిధుల వరద పారేనా?

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:00 PM

అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇది..

నిధుల వరద పారేనా?
పాలమూరు యూనివర్సిటీ

మందకొడిగా సాగుతున్న ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు

గతంలో సమీక్ష నిర్వహించినా.. నిధుల మంజూరు అంతంతే...

ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల పెంపు, మహాలక్ష్మి పథకంపై ఆశలు

ఈసారైనా పాలమూరు యూనివర్సిటీకి అధిక నిధులు వచ్చేనా?

కొత్త రిజర్వాయర్లు, లిఫ్టులు మంజూరుపై ఎమ్మెల్యేల దరఖాస్తు

నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల నిధులకు డిమాండ్లు

మహబూబ్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇది.. గత రెండు బడ్జెట్‌లలో తెలంగాణకు కేంద్రం కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఓ మారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు, నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తదితర అంశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ఆరు గ్యారంటీల్లో భాగంగా కొన్ని పథకాలకు ఇప్పటివరకు నిధులు కేటాయించ లేదు. మరికొన్ని మందకొడిగా సాగుతున్నాయి. అలాగే అభివృద్ధి పనులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులపై డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో వాటన్నింటికీ మోక్షం లభించాలనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులకు పలు సభల్లో గ్రీన్‌ చానల్‌ ద్వారా నిధులు అందిస్తామని, సంవత్సరానికి రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా కొంతకాలంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు ఉమ్మడి జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయి. గత సంవత్సరం సీఎం సమీక్ష చేసి.. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులతోపాటు అభివృద్ధి పనులకు నిధుల వరద ఈ బడ్జెట్‌లోనైనా పారుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పెండింగ్‌ ప్రాజెక్టుల పరిస్థితేంటి?

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, డిస్ర్టిబ్యూటరీలు, ఫీడర్‌ ఛానళ్ల నిర్మాణం తదితర పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిజైన్‌ ప్రకారం పూర్తి ఆయకట్టుకు నీరందించాలంటే మరో రూ.377 కోట్లు అవసరం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి. ఇప్పటివరకు రూ.2,503 కోట్లు ఖర్చు చేయగా, పూర్తి చేయడానికి రూ.231.36 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. గత సంవత్సరం రూ.105 కోట్లు కేటాయింపులు చేసినా.. అవి రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌కు మాత్రమే సరిపోయాయి. అలాగే ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీల కారణంగా పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి ఉంది. దీనికి మరో రూ.142 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. భీమా ఎత్తిపోతల పథకాన్ని రెండు దశలుగా చేపట్టారు. భీమా 1 ద్వారా 1.11 లక్షల ఎకరాలు, భీమా-2 ద్వారా 2.03 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు ప్రారంభ అంచనా.. రూ.2,158 కోట్లు కాగా.. దీని పూర్తికి దాదాపు రూ.350 కోట్లు అవసరం అవుతాయని అంచనాలు ఉన్నాయి. కోయిల్‌సాగర్‌ పరిధిలో ఆయకట్టు విస్తరణకు రూ.100 కోట్లు అవసరం కానున్నాయి. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.900 కోట్లతో చేపట్టగా, ప్రస్తుత అంచనా రూ.1197.70 కోట్లకు చేరింది. ఇందులో రూ.629.26 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 558.34 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అసలు కీలకమైన వల్లూరు, జూలకల్‌, మల్లంపల్లి రిజర్వాయర్ల ఊసే లేదు. ప్రస్తుత రేట్లను పరిగణలోకి తీసుకుంటే రూ.1,500 కోట్లు దాటే అవకాశం ఉంది. గట్టు ఎత్తిపోతల పథకానికి రూ.581 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు 204.96 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 362 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి.. ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.55,086 కోట్లు అవసరం. కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీరంద లేదు. మళ్లీ రేట్లు పెంచితే ఆ మొత్తం రూ.80 వేల కోట్ల వరకు చేరుకుంటుందని ఇరిగేషన్‌ నిపుణులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో రూ.1,285 కోట్లు పీఆర్‌ఎల్‌ఐకి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కానీ ఇక్కడ పనులు అత్యంత నెమ్మదిగా నడుస్తున్నాయి. కీలకమైన ఉదండాపూర్‌ నిర్వాసితుల పరిహారంపై ఇంకా సందిగ్ధం ఉంది. వీటితోపాటు కొత్త రిజర్వాయర్లు, లిఫ్టులను మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి 2024 ఫిబ్రవరి 21న సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశ టెండర్లు పూర్తయ్యాయి. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినా.. ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.

అభివృద్ధి.. సంక్షేమం.. నిర్వహణ కావాల్సిందే?

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో భాగంగా ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రుణమాఫీ, బోనస్‌, రైతు భరోసా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పెంపు తదితరాలు అమలవుతున్నాయి. అయితే ఇంకా మహాలక్ష్మి పథకం అమలు కావడం లేదు. అలాగే కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. వికలాంగులు, వితంతువులు, ఇతర భృతి పొందే వారు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్ల పెంపును కూడా అమలు చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు కార్యాచరణ మొదలు కాలేదు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు అయినప్పటికీ.. బడ్జెట్‌లో ఈ పథకానికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. కొత్త టూరిజం పాలసీ అమల్లోకి వస్తే.. నల్లమల ఫారెస్ట్‌ ఎకో టూరిజం, రివర్‌, ఆధ్యాత్మిక టూరిజానికి నిధులు అవసరం ఉంది. ఇక పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులు చాలా తక్కువగా చేస్తున్నారు. గతేడాది రూ. 11 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది దాదాపు రూ.200 కోట్లకు అంచనాలు పంపించారు. ఇంజనీరింగ్‌, లా కాలేజీ మంజూరు కాగా.. వాటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈసారి పీయూకు బడ్జెట్‌లో కేటాయింపులు అధికంగా ఉండాలనే అభిప్రాయం ఉంది. అలాగే గురుకులాల, ఇతర విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు, రోడ్లు, మునిసిపాలిటీల అభివృద్ధికి కూడా ఎమ్మెల్యేలు నిధులను ఆశిస్తున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:00 PM