వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ABN , Publish Date - May 12 , 2025 | 11:03 PM
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. పలు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
- మాగనూరులో కనుల పండువగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణం
- పెద్దచింతకుంటలో ఈశ్వరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
- పాతర్‌చెడ్‌లో ఆంజనేయస్వామి రథోత్సవం
- పేటలోని అన్ని ఆలయాల్లో పౌర్ణమి పూజలు
మాగనూరు/మరికల్/నారాయణపేట/నారాయణపేట న్యూటౌన్/నర్వ, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. పలు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేసవి ని లెక్క చేయకుండా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మాగనూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో పురోహితుల వేదమంత్రాల మధ్య ముత్తయిదువలు స్వామివారికి, అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో తలంబ్రాలు పోశారు. తెల్ల వారుజామున ఉత్సవ విగ్రహాలను పల్లకీలో చిన్నరథం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని గోవింద నామస్మరణతో లాగారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు, విద్యుత్‌శాఖ అధికారు లు, పోలీసు, పంచాయతీ సిబ్బంది తదితరులు సహకరించారు.
అదేవిధంగా, మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో దైవకార్య నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీఈశ్వరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు సామూహిక హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు గ్రామ పురవీధుల గుండా స్వామివారి పల్లకీసేవ, భజన సంకీర్తనలతో ఊ రేగింపు చేశారు. మంగళవారం తెల్లవారుజా మున రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ రాములు, సింగిల్ విండో అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
నారాయణపేటలోని లక్ష్మీనర్సింహసహిత రాఘవేంద్రస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి మహా రథోత్సవ వేడుకలు హరిదా సుల సంకీర్తనల నడుమ కనుల పండుగా జరిగాయి. అంతకుముందు జ్యోషి రఘుప్రేమచార్య లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ వేడుకలను చేయ గా, అర్చకుడు నర్సింహచారి నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే, జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీదేవి భూదేవి సహిత సత్యనారాయణ స్వామి కల్యాణ వేడకులను కమనీయంగా జరిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి నామస్మరణలతో రథోత్సవాన్ని చేపట్టారు.
నర్వ మండలం పాతర్‌చెడ్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా జైశ్రీరామ్, జైహనుమాన్ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతం మార్మోగింది. రథోత్స వానికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మండల ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే, నారాయణపేట చౌక్‌బజార్ బసవేశ్వర దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం రాత్రి మహా రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.