Share News

హామీలు ఎందుకిచ్చారు?

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:22 PM

అప్పులున్న సంగతి తెలిపి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో ఎందుకు హామీలు ఇచ్చిందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

హామీలు ఎందుకిచ్చారు?

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

మదనాపురం, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : అప్పులున్న సంగతి తెలిపి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో ఎందుకు హామీలు ఇచ్చిందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోగానే లంకెబిందెలు ఉన్నాయ ని అనుకున్న కానీ ఖాళీ బిందెలు ఉన్నాయన్నారని, ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకు ముందు తెలియదా అని ప్రశ్నించారు. రేషన్‌ షాపులలో కేంద్రం నుండే ప్రతీ ఒక్కరికి ఐదు కేజీల బియ్యం, మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా, కౌలు రైతుల సంగతి మరిచిపోయిందన్నారు. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇంత వరకు ఏలాంటి హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతోందన్నారు. కొత్తకోట మునిసిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం తాగునీటి కోసం కేటాయించిన నిధులను ఎమ్మెల్యే ఎందుకు ఖర్చు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, నాయకులు నారాయణ, ప్రశాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కృష్ణయాదవ్‌, భరత్‌ భూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:22 PM