అదృష్ట జాతకులెవరో?
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:50 PM
మద్యం దుకాణాలకు నేడు లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీడి్‌పలో దుకాణాలను దక్కించుకునే అదృష్ట జాతకులెవరో తేలనుంది. నెల రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించింది.
మద్యం దుకాణాలకు నేడే లక్కీడిప్
కలెక్టరేట్‌లలో ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5,524 దరఖాస్తులు
ప్రభుత్వానికి రూ.165.72 కోట్ల ఆదాయం
మహబూబ్‌నగర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాలకు నేడు లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీడి్‌పలో దుకాణాలను దక్కించుకునే అదృష్ట జాతకులెవరో తేలనుంది. నెల రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించింది. ఈసారి టెండర్లు వేసేందుకు వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం గడువు ముగిసిన తరువాత మరో 5 రోజులపాటు పొడిగించింది. అయినా గతంతో పోలిస్తే చాలావరకు టెండర్లు తగ్గాయి. ఉమ్మడి పాలమూరులోని 227 మద్యం దుకాణాలకుగాను 5,524 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.165.72 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ సమీకృత భవనాల్లో కలెక్టర్‌ల ఆధ్వర్యంలో లక్కీడిప్ నిర్వహించనున్నారు. వ్యాపారుల స మక్షంలోనే లక్కీడిప్ తీస్తారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు మాత్రం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో, మిగతా అన్ని జిల్లాలకు ఆయా జిల్లాల కలెక్టరేట్‌లలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దుకాణాలు వచ్చిన వారు ఆయా ప్రాంతంలోని లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు అక్కడే చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహబూబ్‌నగర్ నగరంలో ఏడాదికి రూ.65 లక్షల లైసెన్స్ ఫీజుగా ఉండగా.. వీరు రూ.10.33 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వాళ్లు లక్కీడి్‌పకు కచ్చింతంగా హాజరుకావాలి. వారురాని పక్షంలో సంబంధిత దరఖాస్తుదారుడి చేత ధ్రువీకరణ పత్రం తేవాలి.
జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లాలో 56 దుకాణాలుండగా 1,634 దరఖాస్తులు వచ్చాయి. నారాయణపేట జిల్లాలో 36 దుకాణాలకు 853, నాగర్‌కర్నూల్‌లో 67 దుకాణాలకు 1,596, వనపర్తిలో 36 దుకాణాలకు 757, గద్వాలలో 34 దుకాణాలకు 774 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో లక్కీడిప్ కోసం ఎక్సైజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది.