Share News

వంతెనకు మోక్షమెన్నడు?

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:34 PM

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన దూరభారాన్ని తగ్గించే సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం ఆలస్యమవుతోంది.

వంతెనకు  మోక్షమెన్నడు?
సోమశిల - సిద్దేశ్వరం వంతెన నిర్మించాల్సిన ప్రదేశం ; ఇంజనీర్లు రూపొందించిన బ్రిడ్జి నమూనా

- నిర్మాణానికి నోచుకోని ‘సోమశిల - సిద్దేశ్వరం’

- పూర్తయితే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం

- టెండర్లు పిలిచినా నేటికీ పూర్తి కాని ప్రక్రియ

- అటవీశాఖ అభ్యంతరాలే ప్రధాన కారణం

నాగర్‌కర్నూల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన దూరభారాన్ని తగ్గించే సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల దగ్గర కృష్ణానదిపై ఈ వంతెనను చేపడుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అఽధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

చిరకాల నినాదంగా వంతెన నిర్మాణం

సోమశిల సిద్దేశ్వరం వంతెన అంశం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన చిరకాల వాంఛగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ వంతెన కోసం అనేక ఆందోళనలు జరిగాయి. ఈక్రమంలో కృష్ణా నదిని దాటేందుకు మంచాలకట్ట వద్ద మరబోటులో ప్రయాణిస్తున్న 64 మంది జల సమాధి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో కృష్ణానదిపై బ్రిడ్జిల నిర్మాణాన్ని విస్మరించారు. రెండు రాష్ట్రాల్లో కూడా సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు ఉధృతం కావడంతో కేంద్రంలో బీజేపీ అఽధికారంలోకి వచ్చాక స్థానిక నేతల నుంచి వెళ్లిన విజ్ఞప్తుల మేరకు కల్వకుర్తిలోని కొట్ర గేటు నుంచి కొల్లాపూర్‌ మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారికి ఆమోదం తెలిపింది. సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తే హైదరాబాద్‌ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 80 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. బెంగళూరు, చెన్నైలకు కూడా రవాణా సౌకర్యం మెరుగు పడటంతో పాటు నాగర్‌కర్నూల్‌ నుంచి కొల్లాపూర్‌ వరకు చిరు వ్యాపారులందరికీ శాశ్వతమైన జీవనోపాధి దొరుకుతుంది.

బ్రిడ్జి నిర్మాణానికి అనేక ఆటంకాలు

ఉపాధి మార్గాన్ని మెరుగుపర్చడంతో పాటు రవాణా భారాన్ని తగ్గించే సోమశిల సిద్దేశ్వరం వంతెనకు పర్యావరణ అనుమతులు చాలా కీలకంగా మారాయి. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రూ. 3వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది మీదుగా కొనసాగుతుండటంతో ఫారెస్టు క్లియరెన్స్‌ లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. 2020లో 167కే హైవేకు పరిపాలనాపరమైన ఆమోదం వచ్చి పనులు ప్రారంభమయ్యాయి. 2022లో సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జికి రూ. 1100 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచినా బ్రిడ్జి నిర్మాణానికి వివిధ అనుమతులు నిరాకరించడంతో టెండర్లు ఇంకా ఓపెన్‌ చేయకపోవడం గమనార్హం.

Updated Date - Jul 04 , 2025 | 11:34 PM