‘వికాసం’ ఎప్పుడు?
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:17 PM
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.
- పెండింగ్‌లో రాజీవ్ యువ వికాసం
- కల్వకుర్తి డివిజన్‌లో 11,896 దరఖాస్తులు
- దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూలు పూర్తి
- ఇప్పటికీ మంజూరు కాని రుణాలు
కల్వకుర్తి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగులకు చిన్న తరహా పరిశ్రమలు, వృత్తి, వ్యాపారాల నిర్వహణకు సబ్సిడీపై రుణాలు ఇచ్చి పోత్సహించనున్నట్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. కానీ వారికి ఇప్పటివరకు మంజూరు పత్రాలు కానీ, రుణాలు కానీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లో..
రాజీవ్ యువ వికాసం పథకం కింద నాలుగు కేటగిరీలలో రుణాలు ఇవ్వనున్నారు. కేటగిరి -1 లో రూ. 50 వేలు, కేటగిరి -2లో రూ. లక్ష, కేటగిరి - 3లో రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు, కేటగిరి - 4 లో రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందించాల్సి ఉంది. ఈ పథకం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా, రెవెన్యూ డివిజన్ పరిధిలో 11,896 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసంలో దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ ఏడాది మే 5 నుంచి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
మండలాల వారీగా..
కల్వకుర్తి మండలంలో 3,665 మంది దరఖాస్తు చేసుకోగా, 3,500 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కల్వకుర్తి మునిసిపాలిటీలో 1,510 మంది దరఖాస్తు చేసుకోగా, 1,235 మంది, వెల్దండ మండలంలో 2,310 మందికి, 1,530 మంది, ఊర్కొండ మండలంలో 970 మందికి, 404 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. చారకొండ మండలంలో 1,487 మందికి గాను 987 మంది, వంగూరు మండలంలో 1,987 మంది దరఖాస్తు చేసుకోగా 1,887 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కేటగిరీ-1లో ఎంపికైన వారికి జూన్ 2న, కేటగిరీ-2లో ఎంపికైన వారికి జూన్ 9న రుణ మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు కానీ, ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ లోపే మంజూరు పత్రాలు అందించి, రుణాలను మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే అందుకు అవకాశం ఉండదని చెప్తున్నారు.
వెంటనే నిధులు విడుదల చేయాలి
ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు : యువ వికాసానికి వెంటనే నిధులు విడుదల చేయాలి. దరఖాస్తుదారులందరిని భేషరత్తుగా యూనిట్లను మంజూరు చేసి గ్రౌండ్ చేయాలి. ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 50వేల నుంచి రూ.4లక్షల వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు విడుదల చేసి సహకరించాలి.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు
ఎన్.వెంకట్రాములు, ఎంపీడీవో : ప్రభుత్వ ఆదేశానుసారం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. రుణల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు రాగానే అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు ఇచ్చి, యూనిట్లను గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకుంటాం. ఆ లోపే లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వనున్నాం.