పాలమూరుపై పట్టింపేది?
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:38 PM
పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ జిల్లా అభివృద్ధిపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పురాతనమైన పాలమూరు పట్టణంలో ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని, తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌లో పదేళ్ల క్రితమే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపట్టడం కూడా సాధ్యం కావడం లేదా?
జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని 50 పడకలకు ఎందుకు కుదించారు
ప్రజాధనం వృథా చేస్తూ కురుమూర్తి వద్ద రోడ్డు పనులు చేస్తున్నారు
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే కాంగ్రె్‌సలో ఉన్నారా?.. బీజేపీలో ఉన్నారా?
ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రిజర్వాయర్లలో క్రికెట్ ఆడుకోవాలి
విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మహబూబ్‌నగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ జిల్లా అభివృద్ధిపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పురాతనమైన పాలమూరు పట్టణంలో ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని, తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌లో పదేళ్ల క్రితమే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన జాగృతి ప్రస్థానం సమస్యల పరిష్కారం ఎజెండాగా, ప్రజా పోరాట పంథా మార్గంలో పయనిస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో గత ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తే దాన్ని 50 పడకలకు కుదించారని ఆరోపించారు. ఆ ఆస్పత్రిలో వైద్యం అందకపోవడంతో పురుగుల మందు తాగిన యువ రైతు ప్రాణాలు కోల్పోయాడని విమర్శించారు. గతంలో జడ్చర్ల ఆస్పత్రిలో జనరేటర్ పని చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కట్టేస్తే కరెంటు వస్తుందని అన్నారని, మరి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని కట్టేస్తే పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో కురుమూర్తి దేవస్థానం వద్ద ఒక రోడ్డు వేశారని, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వేయించిన రోడ్డుపై తాను తిరగనని.. ప్రస్తుత ఎమ్మెల్యే మరో రోడ్డు వేయిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఖజానాను నింపుతామని చెప్పి.. ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారన్నారు. కానీ బీజేపీలో, కాంగ్రె్‌సలో ఏ పార్టీలో ఉన్నారో తెలియని పాలమూరు ఎమ్మెల్యే తమకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో తిరగలేకపోతున్నామని అంటున్నారని గుర్తు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే తనను గెలిపించిన 24 గంటల్లో కొల్లూరును మండలం చేస్తామని ప్రకటించారని, కానీ చేయలేదన్నారు. సెజ్ విషయంలో పీసీబీ అధికారులు దాడులు చేస్తారని తెలిసి.. ముందే హడావిడి చేస్తూ.. సీఎంనే తిడుతుంటారని అన్నారు.
పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తయ్యాయని, 20 శాతం లింకేజీ పనులు మాత్రమే ఉన్నాయని అన్నారు. కేసీఆర్‌కు పేరొస్తుందని పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే.. చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని, బనకచర్ల ద్వారా గోదావరి నీటిని తరలించుకుపోతారని అన్నారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలమట్టి ఎత్తు పెంచితే.. పాలమూరు రిజర్వాయర్లలో క్రికెట్ ఆడుకోవాల్సి ఉంటుందన్నారు. భారీ వర్షాలు కురవకపోతే దిగువకు చుక్కనీరు రాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టుకోవచ్చని, కానీ అదే సమయంలో పాలమూరు- రంగారెడ్డి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో అసలు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో 30వ తేదీ నుంచి కాలేజీలు బంద్ చేస్తారని అంటున్నారన్నారు. అలాగే తెలంగాణ మైనారిటీ గురుకులాలకు 13 నెలలుగా అద్దె అందడం లేదని గుర్తుచేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ముస్లింలు, లాంబాడాలు లేని మొదటి కేబినెట్ ఇదేనని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చుకున్నప్పటికీ.. ఇప్పటికీ భవనాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు లేవని అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు కానివ్వబోమని స్పష్టం చేశారు.