సంక్షేమం గజగజ
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:45 PM
విరిగిన కిటికీల తలుపులు.. తలుపులు లేని బాత్‌రూమ్‌లు.. వెలగని లైట్లు.. పెచ్చులూడుతున్న పైకప్పులు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు ఇవి.. అసలే చలికాలం కావడంతో విరిగిన కిటికీలు, తలుపుల సందుల్లోంచి చల్ల గాలులు లోపలికి రావడంతో విద్యార్థులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.
చలికి వణుకుతున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు
విరిగిన కిటికీలు, గదుల తలుపులు
శిథిలావస్థకు చేరిన భవనాలతో పొంచి ఉన్న ముప్పు
అద్దె భవనాల్లో ఇరుకు గదులతో ఇక్కట్లు
సరిపడని మరుగుదొడ్లు, స్నానపు గదులతో అవస్థలు
విరిగిన కిటికీల తలుపులు.. తలుపులు లేని బాత్‌రూమ్‌లు.. వెలగని లైట్లు.. పెచ్చులూడుతున్న పైకప్పులు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు ఇవి.. అసలే చలికాలం కావడంతో విరిగిన కిటికీలు, తలుపుల సందుల్లోంచి చల్ల గాలులు లోపలికి రావడంతో విద్యార్థులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. చాలా చోట్ల వేడినీటి సౌకర్యం లేక, ఉన్న చోట గ్రీజర్లు పని చేయక తెల్లవారుజామున చలిలోనే స్నానాలు చేయాల్సి వస్తోంది. చాలా చోట్ల ఫిల్టర్ నీటి సౌకర్యం లేకపోవడంతో బోరు నీటినే తాగుతున్నారు. ఇంకొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టళ్ల నిర్వహణతో ఇరుకు గదుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి జిల్లాలోని పలు వసతి గృహాలను ‘ఆంధ్రజ్యోతి’ విజిట్ చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
- మహబూబ్‌నగర్/నారాయణపేట/నాగర్‌కర్నూల్/వనపర్తి/జోగుళాంబ గద్వాల
ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. సౌకర్యాలు సరిగా లేక అవస్థలు పడు తున్నారు. జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం కిటికీలకు తలుపులు లేవు. చలిగాలులు వీస్తుండటంతో విద్యార్థులు కిటికీలకు బెడ్‌షీట్‌లు కట్టుకున్నారు. చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ మండలం ఎస్టీ బాలికల హాస్టల్‌లో కిటికీలు తుప్పుపట్టాయి. గది పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి. ఫిల్టర్ నీళ్లు లేకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నారు. భోజన శాల లేకపోవడంతో ఆరు బయటే భోజనం చేస్తున్నారు. బాలానగర్ ఎస్సీ హాస్టల్‌లో కిటికీ తలుపులకు రంధ్రాలు పడ్డాయి. వాటిగుండా చల్ల గాలి వీస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోయిలకొండ మండలంలోని గురుకుల, బీసీ హాస్టల్‌లో కూడా కిటికీలకు తలుపులు లేవు.
నీటి కొరత
గండీడ్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో నీటి కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న బోరులోంచి నీరు తక్కువగా వస్తుండటంతో మరో బోరు వేయాల్సిన అవసరం ఉంది. అదనపు గదుల నిర్మాణం పదేళ్ల క్రితమే నిర్మించినా వాడుకలో లేకపోవడంతో వృథాగా ఉన్నాయి.
అద్దె భవనాల్లో ఇక్కట్లు
మిడ్జిల్‌లో సాంఘిక సంక్షేమ వసతి గృహం అద్దె భవనంలో అరకొర వసతులతో కొనసాగుతోంది. హన్వాడ మండలం ఎస్సీ హాస్టల్‌లో బాత్‌రూమ్‌లు చాలక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చాలాచోట్ల బెడ్‌షీట్‌లు పంపిణీ చేసినా కిటికీలకు తలుపులు లేక చలికి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదుకాగా, మున్ముందు మరింత పడిపోయే అవకాశం ఉంది. కిటికీలకు తలుపులు బిగించాలని విద్యార్థులు కోరుతున్నారు.
అరకొర గదులతో ఇక్కట్లు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం కోటకొండ జ్యోతిరావు పూలే బీసీ వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. 443 మంది విద్యార్థులకు 12 తరగతి గదులు, 12 హాస్టల్ గదులు ఉన్నాయి. గదుల కొరత విద్యార్థులకు శాపంగా మారింది. రాత్రి వేళ పడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. స్థలం లేక దుస్తులను పక్క ప్లాట్లలో ఆరబెడుతున్నారు. బాత్‌రుమ్‌లు అరకొరగా ఉన్నాయి. చన్నీటితో స్నానాలు చేసేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విరిగిన కీటికీలు, డోర్లు
మాగనూర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు చన్నీటి స్నానానికి ఇబ్బందులు పడుతున్నారు. కీటికీలు, డోర్లు సక్రమంగా లేక చలికి వణికిపోతున్నారు. బాత్‌రూమ్‌ల దగ్గర లైట్లు సరిగా లేవు. తాగడానికి ఫిల్టర్ నీరు లేదు. ఇక్కడ 199 మంది విద్యార్థులు ఉంటున్నారు. కోస్గి ఎస్సీ బాలుర వసతి గృహంలో బాత్‌రూమ్‌ల దగ్గర లేటింగ్ లేదు. తాగడానికి ఫిల్టర్ నీరు లేదు. చన్నీటి స్నానాలతో వణికిపోతున్నారు.
పెచ్చులూడుతున్న పైకప్పు
మక్తల్ ఆనంద నిలయంలో 75 మంది విద్యార్థులు ఉంటున్నారు. బాత్‌రూమ్‌ల తలుపులు విరిగిపోయాయి. కీటికి తలుపులు విరిగిపోవడంతో చలి గాలులకు విద్యార్థులు వణికిపోతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడుతుండటంతో భయపడుతున్నారు. నర్వ కస్తూర్బాలో 390 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఇక్కడ కూడా చన్నీటి స్నానాలతో అవస్థలు పడుతున్నారు.
సరిపోని నీళ్లు
నారాయణపేట శాతవాహన కాలనీలో అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. కిటికీ తలుపులు విరిగిపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు శుభ్రంగా లేక దుర్వాసన వస్తోంది. చన్నీటితోనే స్నానాలు చేస్తున్నారు. బాత్‌రూంలకు డోర్‌లు సరిగా లేవు. ఉన్న ఒక ట్యాంక్ నీరు సరిపోవడం లేదు. గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. స్విచ్ బోర్డులు విరిగిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. రాత్రి వేళలో జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు వార్డెన్, వాచ్‌మన్ అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. మెయిన్ గేటు లేకపోవడంతో కుక్కలు, ముగజీవాలు హాస్టల్ ఆవరణలో సంచరిస్తున్నాయి.
శిథిలావస్థ భవనంలో ఇక్కట్లు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి ఎస్సీ వసతి గృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో 2019 నుంచి రేకుల భవనంలో అద్దెకు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే రేకులు కారుతున్నాయి. మరుగుదొడ్లు రెండే ఉండటంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలంపూర్‌లో బీసీ, ఎస్సీ బాలుర, బాలికల కేజీబీవీలు ఉండగా దాదాపు 420మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కేబీబీవీలో సోలార్ విద్యుత్ పరికరాలు ఉన్నా అవి వినియోగించడంలేదు. దీంతో చన్నీటి స్నానాలే చేస్తున్నారు. ఇదే పరిస్థితి కేటీదొడ్డి కేజీబీవీలో కూడా ఉంది. మల్దకల్ ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రహరీ లేక విషపురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. రాజోలి ఎస్సీ బాలుర వసతి గృహంలో 60మంది విద్యార్థులకు ఒకే గది ఉండటంతో అందరు అందులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. గద్వాలలోని బాలుర వసతి గృహంలో కిటికీలకు తలుపులు లేక చలికి వణికిపోతున్నారు. ఎర్రవల్లి మండలం ధర్మారం బీసీ హాస్టల్‌లో 140మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. తలుపులు కిటికీలు లేవు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న పాఠశాలలో పడుకోంటున్నారు. అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులుకు కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం అందించలేదు.
ప్రహరీలు లేక విషపురుగుల బెడద
వనపర్తి జిల్లాలో బీసీ 15, ఎస్సీ 21, ఎస్టీ 5 బాలుర వసతి గృహాల్లో 5,300 విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాలకు రెండేళ్లుగా నిధులు లేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. పాన్‌గల్, అమరచింత మండల కేంద్రాల సమీపంలో ఎస్సీ బాలుర వసతి గృహాలకు ప్రహారీ లేకపోవడంతో విషపురుగులు సంచరిస్తున్నాయి. కొత్తకోట బీసీ బాలుర వసతి గృహానికి తలుపులు, కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చలికి వణుకుతూ చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. ఖిల్లాఘణపూర్ ఎస్సీ, గిరిజన వసతి గృహ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు పెచ్చులూడి పడతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రివేళలో విద్యార్థులు డైనింగ్ హాల్‌లోనే నిద్రిస్తున్నారు. పెబ్బేరులో ఉన్న బీసీ బాలుర, బాలికల, కేజీబీవలు ఉన్నాయి. ఈ మూడు వసతి గృహాల్లో గదులకు కిటికీలు, డోర్ తలుపులు లేక చలికి ఇబ్బంది పడుతున్నారు. వీపనగండ్ల వసతి గృహ విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేసుకుంటున్నారు.
పంపిణీ చేయని రగ్గులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో మన్ననూర్ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో రగ్గుల పంపిణీ నేటికీ జరగలేదు. వాటర్ హీటర్లు లేకపోవడంతో చన్నిటీ స్నానం చేస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వెల్దండలోను బీసీ బాలుర వసతి గృహంలో 170మంది విద్యార్థులు ఉండగా వారు నివసిస్తున్న భవనం శిథిలావస్థకు చేరింది. ఊర్కొండ బీసీ హాస్టల్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులంతా బయటకు వెళ్లాల్సి వస్తోంది. లింగాల ఎస్టీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగూరు మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులు పడుకునే చోట కిటికీ రెక్కలు లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. చలికాలంలో వేడినీటిని అందించడానికి రూపకల్పన చేసి సోలార్ హీటర్లు నిరుపయోగంగా మారాయి. అవి ఒక్క రోజు కూడా వేడినీటిని అందించిన దాఖలాలు లేవని విద్యార్థులు అంటున్నారు.
చన్నీటితో స్నానాలు
ఈ కాలంలో చన్నీళ్లతో స్నానాలు చేయాలంటే వణికిపోతున్నాం. చలికాలం వేడినీళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- దివ్య, పదో తరగతి, కోటకోండ జ్యోతిరావుపూలే వసతి గృహం, మరికల్
చలికి వణుకుతున్నాం
భవనం కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికి వణికిపోతున్నాం. దుప్పట్లు కూడా పంపిణీ చేయ లేదు. రాత్రంతా నిద్రొస్త లేదు.
- విజయ్, 7వ తరగతి, గిరిజన ఆశ్రమ పాఠశాల, ఖిల్లాఘణపురం