Share News

నీళ్లు దండిగా సాగు పండగ

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:03 PM

స్థానికంగా వర్షాలు ఈ ఏడాది భారీగా లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద భారీగానే వస్తోంది. జూలై మొదటి వారమైతేనే ఎగువ నుంచి దిగువకు నీటి విడుదల కావాల్సిన స్థితి ఉండగా ఈ ఏడాది మండుటెండలు ఉంటే మేలోనే వరదలు ప్రారంభమయ్యాయి.

నీళ్లు దండిగా సాగు పండగ
వనపర్తి జిల్లా పానగల్‌ మండలం అన్నారం వద్ద నాట్లు వేస్తున్న మహిళలు

ఈ ఏడాది ప్రాజెక్టులకు మే నెల నుంచే ప్రారంభమైన వరదలు

సాధారణం కంటే ఎక్కువ వరద రోజులు నమోదయ్యే అవకాశం

జూరాల ప్రాజెక్టుకు ఇప్పటివరకు 457 టీఎంసీల వరద నమోదు

పలు ఎత్తిపోతల పథకాల కింద రిజర్వాయర్లు, చెరువుల్లో జలకళ

రెండు జల విద్యుత్‌ కేంద్రాల్లో 426 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానికంగా వర్షాలు ఈ ఏడాది భారీగా లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద భారీగానే వస్తోంది. జూలై మొదటి వారమైతేనే ఎగువ నుంచి దిగువకు నీటి విడుదల కావాల్సిన స్థితి ఉండగా ఈ ఏడాది మండుటెండలు ఉంటే మేలోనే వరదలు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్‌ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జూలైలో గేట్లు తెరవడం ఇదే మొదటిసారి. ఆగస్టు మొదటి వారం వచ్చేసరికే రెండుసార్లు శ్రీశైలం గేట్లు తెరవడం, మూయడం జరిగిపోయాయి. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు 1.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తూనే ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇప్పటివరకు 457 టీఎంసీల నీరు వచ్చింది. ఇందులో వాడుకున్నది తక్కువే కాగా సింహభాగం దిగువకు వెళ్లిపోయింది. స్థానికంగా వర్షాలు కురిస్తే ఆరుతడి పంటలను రైతులు ఎక్కువగా సాగుచేసేవారు. కానీ వానాకాలం పంటలకు అనుకూలంగా ఈసారి వర్షాలు కురవలేదు. ఇప్పుడు ప్రాజెక్టుల కింద వరినాట్లు వేసే పనులు జోరుగా సాగుతుండగా వరద రోజుల్లోనే వానాకాలం పంటలు చేతికి వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చిన నీటిని నిలువ చేసుకోకుండా ఎక్కువ రోజులు సాగునీటి శాఖ అధికారులు ఎత్తిపోతల పథకాల పంపులను నిలిపి ఉంచుతున్నారు. ఇది నిర్వహణ లోపమా లేక.. నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడమా అనేది తెలియడం లేదు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా 1, 2, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. కొన్ని పంపులు పనిచేయకపోగా పనిచేస్తున్నవి కూడా నిలిపి ఉంచాల్సిన దుస్థితి ఉన్నది.

ఎత్తిపోసింది 14.8 టీఎంసీలు..

జూరాల ప్రాజెక్టు దాని కింద ఉన్న ఆయకట్టుకే కాకుండా నాలుగు ఎత్తిపోతల పథకాలకు ఆదెరువు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా 1, 2 ఎత్తిపోతల పథకాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే నీరు వెళుతోంది. సంవత్సరాలుగా కేటాయింపుల మేర నీటిని ఈ ఎత్తిపోతల పథకాల కింద లిఫ్ట్‌ చేయడం లేదు. కారణం స్టోరేజీ రిజర్వాయర్లు లేకపోవడం ఒకటైతే, వరద వస్తున్న సమయంలో మోటార్లను నిలిపి ఉంచడం మరో కారణంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మేలోనే వరద ప్రారంభం కాగా ఎత్తిపోతల పథకాలను ముందుగానే ప్రారంభించారు. అన్ని ఎత్తిపోతల పథకాలకు కలిపి 14.8 టీఎంసీలను ఇప్పటివరకు ఎత్తిపోశారు. ఇందులో భీమా లిఫ్ట్‌ 1కు 2.6 టీఎంసీలు, భీమా లిఫ్ట్‌ 2 కు 2.4 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌ లిప్టునకు 1.8 టీఎంసీలు, నెట్టెంపాడు లిఫ్టునకు 8 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీల కారణంగా 4 టీఎంసీలకు గాను ఇప్పటికీ 2 టీఎంసీల నీటినే నిల్వ ఉంచుతున్నారు. కేంద్రం నియమించిన కమిటీ పరిశీలన చేసి వెళ్లినప్పటికీ ఇంకా మరమ్మతుల కోసం నిధుల విడుదల కాలేదు. దీనివల్ల గద్వాల జిల్లాలో మెజారిటీ ఆయకట్టుకు నీరందని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్యాకేజీ 99, 100 పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. గత సంవత్సరం సీఎం సమీక్ష సందర్భంగా దీనిపై ప్రస్తావన రాగా నిధులు విడుదలను స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయినా ఇంకా పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని ఎత్తిపోతల పథకాల కింద నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు తక్కువగా ఉండటంతో కేటాయింపుల మేర నీటి వినియోగం జరగడం లేదు.

426 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి..

అనుకున్న సమయం కంటే ఈ ఏడాది ముందుగానే వరదలు రావడంతో విద్యుదుత్పత్తి కూడా భారీగానే జరుగుతోంది. అప్పర్‌, లోయర్‌ జూరాల కలిపి ఇప్పటివరకు 426 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. అప్పర్‌ జూరాల ద్వారా 196 మి.యూనిట్ల ఉత్పత్తి జరగ్గా, లోయర్‌ జూరాల ద్వారా 230 మి.యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఇంకా సెప్టెంబరు వరకు వరద నమోదయ్యే సూచనలు ఉండటం. భీమా నుంచి కూడా వరద వస్తుండటంతో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉంది. అలాగే రెండేళ్ల క్రితం అప్పర్‌ జూరాలలో మూడో యూనిట్‌ మరమ్మతులకు గురైంది. తాజాగా మూడో యూనిట్‌కు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకువవచ్చారు. అయితే బ్లాకులను ఎత్తే సమయంలో వాటిలో బురద పేరుకుపోవడంతో కర్ణాటక నుంచి హై స్పీర్‌ పవర్‌ కలిగిన రెండు భారీ క్రెయిన్‌లను తీసుకువచ్చారు. రహదారిపై రాకపోకలను నిలిపివేసి బ్లాకులను పైకి ఎత్తి తిరిగి అమర్చారు. ఇప్పుడు ఆ యూనిట్‌ ద్వారా కూడా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పర్‌, లోయర్‌ జూరాల విద్యుత్‌ కేంద్రాలు రెండు సమానమైన సామర్థ్యం కలిగినవి అయినప్పటికీ రెండేళ్లుగా అప్పర్‌ జూరాలలో మూడో యూనిట్‌ మరమ్మతులకు గురికావడం వల్ల విద్యుదుత్పత్తి తక్కువగా జరుగుతోంది.

Updated Date - Aug 11 , 2025 | 11:03 PM