రెండేళ్లుగా ఎదురుచూపులు
ABN , Publish Date - May 26 , 2025 | 11:08 PM
ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి నిధులు మంజూరైనా.. ఆ తండావాసులు బీటీ రోడ్డు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
జడ్చర్ల మండలం పెద్దతండా, బాలానగర్ మండలం రాంజీతండాకు కలగా మారిన బీటీ రోడ్డు
జడ్చర్ల, మే 26 (ఆంధ్రజ్యోతి) : ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి నిధులు మంజూరైనా.. ఆ తండావాసులు బీటీ రోడ్డు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు వెల్లడిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్‌శాఖ నుంచి జడ్చర్ల మండలం బూర్గుపల్లి నుంచి పెద్దతండా వరకు 2 కిమీ బీటీ రోడ్డుకు రూ.1.40 కోట్లు, బాలానగర్ మండలం రాంజీతండాకు 1.20 కిమీ బీటీ రోడ్డుకు రూ.84 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్లకు సంబంధించి వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. రెండేళ్లుగా కేవలం ఆ రోడ్డుపై కంకర మాత్రం పరిచారు. తండాలకు బీటీ రోడ్డు పూర్తి చేయించాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను సైతం కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉండగా బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రావెల్ సబ్ బేస్ అంటే కంకర పరిచిన పనికి బిల్లు మంజూరీ అవుతాయని భావించిన సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరీ అయ్యేలా చర్యలు తీసుకుని, తండాలకు బీటీ రోడ్లు వేయించాలని తండావాసులు కోరుతున్నారు.
బిల్లులు రాకపోవడంతో నిలిచిన పనులు..
తండాలకు మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశాడు. తండాలకు బీటీ రోడ్ల నిర్మాణ అంశంపై కాంట్రాక్టర్‌తో మాట్లాడి, త్వరలోనే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
- రఘు, ఏఈఈ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ