'ఉత్త'పోతలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:09 PM
నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కొండదొడ్డి, ముస్లాయి పల్లి, పస్పుల ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి.
- నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు
- దశాబ్దకాలంగా పనిచేయని పంపులు
- ఆయకట్టుకు అందని సాగునీరు
- మెట్టపంటలకే పరిమితమైన రైతులు
మక్తల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కొండదొడ్డి, ముస్లాయి పల్లి, పస్పుల ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. దశాబ్దకాలంగా పంపులు పని చేయక పోవడంతో ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో వర్షాధార పంటలకే పరిమితం కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగునీరు విడు దల మాటే లేకపోవడంతో పంట కాలువల్లో మట్టి పేరుకుపోయింది. ముళ్ల పొదలు పెరిగి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. గత ఏడాది కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
కొండెక్కిన ‘కొండదొడ్డి’
మక్తల్ మండలంలోని కొండదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని 18 ఏళ్ల క్రితం రూ.2,63,52,000 వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా కొండదొడ్డితో పాటు ఎల్లపంల్లి, అప్పన్నపల్లి, పెద్దకడ్మూర్ గ్రామాల పరిధిలోని 15 వందల ఎకరాలకు సాగునీరు అందిం చాల్సి ఉంది. అందు కోసం 215 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. కొత్తలో నాలుగేళ్లు బాగానే పని చేసిన ఈ పథకం ఆ తర్వాత క్రమంగా దెబ్బతిన్నది. నిర్వహణ లోపానికి తోడు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. దీంతో మోటార్లు కాలిపోవడం, కాలువల్లో పూడిక నిండిపోవడంతో ఆయకట్టు పొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేకపోయింది. ఇప్పటివరకూ అదే పరిస్థితి కొనసాగుతోంది.
మూతపడిన ‘ముస్లాయిపల్లి’
ముస్లాయిపల్లి ఎత్తిపోతల పథకాన్ని 1994లో రూ.55 లక్షల వ్యాయంతో ఏర్పాటు చేశారు. ఈ పథ కం ద్వారా దాదన్‌పల్లి, ముస్లాయిపల్లి గ్రామాల పరిధిలోని 650 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. దీంతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నీటిని నింపాల్సి ఉంది. ఈ పథకానికి ప్రత్యేక లైను ఏర్పాటు చేసి ప్రతీ రోజు 16 గంటల విద్యుత్ సరఫరా చేశారు. దీంతో మొదట్లో పదేళ్లపాటు ఈ పథకం బాగానే కొనసాగింది. ఆ తర్వాత మూత పడింది. దాదాపు 16 ఏళ్లుగా పథకం వినియోగంలో లేకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించు కోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తపోతల పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
పాడుపడిన ‘పస్పుల’
పస్పుల ఎత్తిపోతల పథకాన్ని 2006లో అప్పటి ఎమ్మెల్యే స్వర్ణా సుధాకర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. చిట్యాల, పస్పుల, పంచదేవ్‌పహాడ్, పారేవుల, గోప్లాపూర్ గ్రామాల పరిధిలో 4,200 ఎకరా లకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. నాలుగేళ్ల పాటు సక్రమంగా పని చేసిన ఈ పథకం కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడం, విద్యుత్ సమస్య అధికం కావడంతో నిరుపయోగంగా మారింది. మోటార్లు కాలిపోయాయి. కాలువల్లో జమ్ము పెరిగి నీరు విడుదల చేసినా పారే పరిస్థితి లేదు. దాదాపు 13 ఏళ్లుగా దీని గురించి పట్టించుకొనే వారే కరువయ్యారు.
‘ముడుమాల్’దీ అదే పరిస్థితి
కృష్ణ మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన సుకూర్‌లింగంపల్లి, కుసుముర్తి, తంగి డి, గుడెబల్లూర్, ముడుమాల్, మురహర్ దొడ్డి తదితర గ్రామాల పరిధిలోని ఆయకట్టు సాగు నీరు అందించేందుకు 1987లో ముడుమాల్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. రూ. 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వా రా దాదాపు 3600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉంది. అందుకోసం 175 హెచ్‌పీ సామర్థ్యం గల ఐదు మోటార్లను ఏర్పా టు చేశారు. ఈ పథకం కూడా ప్రస్తుతం పని చేయడం లేదు. కొత్త మీటార్లను బిగించి, కాలువలను శుభ్రం చేసి, ఆయ కట్టుకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.