Share News

ఊరించి.. ఉసూరు....!

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:35 PM

స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ఊరించి.. ఉసూరు....!
జడ్చర్ల మండలం కోడుగల్‌లోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో ఆశావహుల్లో నిరుత్సాహం

- ఇప్పటికే వినాయక చవితి, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భారీగా ఖర్చు

- మొదటి విడత నామినేషన్లపై పెద్దగా కనిపించని ఆసక్తి

- ప్రజాక్షేత్రంలో ప్రచారం ఆపొద్దని నేతల నిర్ణయం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. హైకోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు పిటిషన్‌ను తిరస్కరించగా.. అప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడం, హైకోర్టు బుధవారం చేపట్టిన విచారణలో ఏదో ఒకటి తేలుతుందని చాలామంది ఆశించారు. అయితే బుధవారం స్టే ఇవ్వకపోవడం, గురువారం విచారణ చేస్తామని చెప్పడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇక ఎన్నికలకు అడ్డంకులు తొలగి.. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తారని అంతా భావించారు. అధికారులు మొదటి విడతలో కేటాయించిన మండలాల్లో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించి.. అభ్యర్థుల నుంచి స్వీకరించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించి.. నాలుగు వారాల తర్వాత ఈ అంశంపై విచారణ చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ప్రకటన విడుదల చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాగా, తాజా ఉత్తర్వులను అనుసరించి, షెడ్యూల్‌ను మార్చే అవకాశం ఉంటుంది.

11 నామినేషన్లు మాత్రమే...

షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడతలో 38 జడ్పీటీసీ, 420 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. హైకోర్టు బుధవారం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీటీసీ స్థానాలకు 10, జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్‌ దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజాపూర్‌ మండల కేంద్రం ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ వేయగా, నాగర్‌కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక నామినేషన్‌ వేశారు. నారాయణపేట జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు కాగా.. ధన్వాడలో మూడు, దామరగిద్దలో ఒకటి, నారాయణపేట మండలంలో ఒక నామినేషన్‌ వేశారు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో ఎంపీటీసీ స్థానాలకు ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు, గోపాల్‌పేట మండలంలో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేశారు. గద్వాల జిల్లాలో మల్దకల్‌ మండలం తాటికుంట గ్రామ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు నామినేషన్‌ వేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు నామినేషన్ల దాఖలును పరిశీలించారు. ఒకవైపు నామినేషన్లు కొనసాగుతుండగానే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రచారపర్వంలో ముందుకే..

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఊర్లలో పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సారి ఎన్నికలు స్థానిక సంస్థల ఆశావహులను ఊరించి.. ఉసూరు అనిపించినట్లుగా మారాయి. ఎలాగూ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడే తమ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆశావహులు ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఇవ్వడం, అన్నదానాలు చేయడం, చందాలు రాయగా.. దేవి నవరాత్రి ఉత్సవాల్లోనూ ఉత్సాహంగా పాల్గొని తమ భాగస్వామ్యాన్ని చూపించారు. అలాగే దసరా పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. తాజా కోర్టు ఉత్తర్వులతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. కొందరు అభ్యర్థులైతే ఏకగ్రీవాల కోసం రూ. 25 లక్షల నుంచి రూ. 75లక్షల వరకు కూడా ఇస్తామని నవాబుపేట మండలంలో ప్రకటించారు. ఇప్పుడు వారంతా ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే పార్టీలు మాత్రం ప్రచారపర్వంలో ముందుకు సాగాలనే సూచనలు ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ బాకీ కార్డుల పేరుతో బీఆర్‌ఎస్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండగా, దాన్ని అలాగే కొనసాగించాలని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలకు సూచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీని, బీఆర్‌ఎస్‌ను ఎండగట్టాలని, వారి చీకటి ఒప్పందంతోనే రిజర్వేషన్ల విషయంలో ఆటంకాలు వస్తున్నాయని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ప్రణాళికలు చేస్తున్నాయి. అలాగే రాహుల్‌ గాంధీ చేస్తున్న ఓట్‌ చోరీ క్యాంపెయిన్‌ను కొనసాగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ వాయిదా పడగా, తర్వాత కూడా కోర్టు రిజర్వేషన్లను రద్దు చేసేలా ఒకవేళ తీర్పు వెల్లడిస్తే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. మిగతా పార్టీలు కూడా దాదాపు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్లకు ఆమోదం లభిస్తే ప్రస్తుత సరళిని కొనసాగించనున్నాయి.

Updated Date - Oct 09 , 2025 | 11:35 PM