పాతాళ గంగమ్మ పైపైకి!
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:20 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది భారీగా కురుస్తున్న వర్షాలతో పాతాళ గంగమ్మ పైపైకి వచ్చింది.
- గతేడాది కంటే భూగర్భ జలాల గణనీయమైన వృద్ధి
- లింగాల మండలం అంబటిపల్లిలో 0.05 మీటర్ల లోతులోనే నీరు
- ఉండవల్లి మండలంలో 19.02 మీటర్ల లోతులో జలం
- అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షపాతం
- బోరు బావుల కింద సాగుకు రబీలో కూడా ఢోకా లేనట్లే..
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది భారీగా కురుస్తున్న వర్షాలతో పాతాళ గంగమ్మ పైపైకి వచ్చింది. గతేడాది సగటుతో పోల్చితే ఈ ఏడాది భూగర్భజలాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. అటు ప్రాజెక్టులకు మే నెల నుంచి వరద ప్రారంభం కావడంతో చెరువులు నిండటం, ఇటు వర్షాలు కూడా జూన్ నెల నుంచి సమృద్ధిగానే కురుస్తుండటం ఈ వృద్ధికి కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వాగులు జాలు పారుతున్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు అలుగులు దుంకుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనాలు ఉన్నాయి.
50 నుంచి 70 శాతం అధికం
ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే సుమారు 50 నుంచి 70 శాతం వరకు అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భజలాలు కూడా పెరగడంతో, వానాకాలం పంట ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ఎగువన కర్ణాటక నుంచి వస్తున్న వరదలతో ముగుస్తుంది. ఇక యాసంగిలో చెరువుల కింద, బోరు బావుల కింద పంటలు సాగుచేసే వారికి కూడా ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్షాలు భారీగా కురవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 70,640 ఎకరాల్లో సాగు విస్తీర్ణం అధికంగా జరిగింది. నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో సాగు అధికంగా పెరగగా, గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. యాసంగిలో కూడా గతేడాది సాగు అంచనాలను దాటే అవకాశం ఉందని చెప్పవచ్చు.
సగటు కంటే ఎక్కువ వర్షపాతం...:
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. 2020 తర్వాత ఈ ఏడాది ఆ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం ఈ రోజు వరకు 456.9 మిల్లీ మీటర్లు కాగా., ఇప్పటివరకు 737.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 280.3 మిల్లీమీటర్ల వర్షం ఎక్కువగా కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాధారణ వర్షపాతం 394.0 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు 513.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 119.4 మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. నాగర్‌కర్నూలు జిల్లాలో సాధారణ వర్షపాతం 404.5 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు 711.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 306.7 మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. నారాయణపేట జిల్లాలో 440.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా.. ఇప్పటివరకు 638.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 442.6 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 705.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాధారణం కంటే 263.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో దాదాపు 50 శాతం నుంచి 70 శాతం వర్షపాతం అధికంగా నమోదైందని చెప్పవచ్చు.
గతేడాది కంటే మెరుగు
భూగర్భజలాల పెరుగుదలలో గతేడాది కంటే అధిక వృద్ధి నమోదైంది. 2023లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తగా.. 2024లో మంచి వర్షాలే కురిశాయి. అయితే గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది అధిక వర్షపాతంతో భూగర్భజలాలు పెరిగాయని చెప్పవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది ఆగస్టులో 4.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ఈ ఏడాది 4.23 మీటర్లకు పెరిగాయి. 0.61 మీటర్ల పెరుగుదల నమోదైంది. ఈ జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో అత్యంత పైన 0.16 మీటర్ల లోతులోనే నీరు ఉండగా, ఉండవల్లి మండలంలో అత్యంత లోతులో 19.02 మీటర్లలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యంత లోతులో భూగర్భజలాలు ఈ మండలంలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది 9.04 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 5.90 మీటర్లకు పెరిగాయి. గత సంవత్సరం కంటే 3.14 మీటర్ల పెరుగుదల నమోదైంది. ఈ జిల్లాలో కోయిల్‌కొండ మండలం అభంగపట్నంలో అత్యంత లోతులో 17.40 మీటర్ల వద్ద భూగర్బజలాలు ఉండగా.. మహ్మదాబాద్ మండలం నంచర్లలో 0.43 మీటర్ల లోతులోనే నీరు ఉంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 10 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 5 మీటర్లకు పెరిగాయి. ఈ జిల్లాలోని లింగాల మండలం అంబటిపల్లిలో అత్యంతపైన 0.05 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి. అత్యంత లోతులో 13.43 మీటర్ల లోతులో కల్వకుర్తి మండలం మార్చాలలో నీరు ఉంది. నారాయణపేట జిల్లాలో గతేడాది ఆగస్టులో 7.20 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 3.81 మీటర్లకు పెరిగాయి. గతేడాది కంటే 3.39 మీటర్ల వృద్ధి నమోదైంది. ఈ జిల్లాలోని మాగనూరు మండలం కొల్పూరులో 0.22 మీటర్లలోతులో నీరు ఉండగా.. ధన్వాడలో 13.43 మీటర్ల లోతులో నీరు ఉంది. వనపర్తి జిల్లాలో గత ఏడాది 4.98 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఈ సంవత్సరం 4 మీటర్లకు పెరిగాయి. గతేడాది కంటే 0.98 మీటర్లలో నీరు ఉంది. రేవల్లిలో 1.5 మీటర్ల లోతులోనే నీరు ఉండగా.. కొత్తకోటలో 13.95 మీటర్ల లోతులో నీరు ఉంది.