చేనేతకు చెదరని ఆదరణ
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:19 PM
ఫ్యాషన్లు మారుతున్నా, ఆధునిక వస్త్ర ధారణకు మహిళలు, యువతులు ప్రాధాన్యం ఇస్తున్నా, చేనేత పట్టు, కాటన్ చీరలకు మాత్రం ఆదరణ చెక్కు చెదరలేదు.
- టెంపుల్ బార్డర్ నారాయణ పేట ప్రత్యేకం
- పట్టు చీరలకు పెట్టింది పేరు గద్వాల
- మగువల మనసు దోచే నేత వస్త్రాలు
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
నారాయణపేట/ గద్వాల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ఫ్యాషన్లు మారుతున్నా, ఆధునిక వస్త్ర ధారణకు మహిళలు, యువతులు ప్రాధాన్యం ఇస్తున్నా, చేనేత పట్టు, కాటన్ చీరలకు మాత్రం ఆదరణ చెక్కు చెదరలేదు. ఇలాంటి పట్టు, కాటన్ చేనేత చీరలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, గద్వాల జిల్లాలు ప్రఖ్యాతిగాంచాయి. నారాయణపేట చేనేత కార్మికులు తమ కళానైపుణ్యంతో రూపొందించిన పట్టు, కాటన్ చీరలు మగువల మనసును దోచుకుంటున్నాయి. 124 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నారాయణపేట చేనేత కార్మికులు టెంపుల్ బార్డర్‌తో రూపొందించే పట్టు, చేనేత చీరలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ టెంపుల్ బార్డర్‌కు తొమ్మిదేళ్ల క్రితం పెటెంట్ హక్కు కూడా లభించింది. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ కూడా పేట పట్టు చీరను కట్టుకున్న వారిలో ఉన్నారు. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన చేనేత కార్మికుడు యంగలి వెంకట్రాములు మగ్గంపై కుట్టులేని జాతీయ పతాకాన్ని నేసి, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇక్కడి నేత కార్మికులు నేసే పట్టు చీరల్లో రుద్రాక్ష, కోటకొమ్మ, టెంపుల్ బార్డర్ ప్రత్యేకం. వీటితో పాటు ఆధునిక యువతుల అభిరుచికి తగ్గట్లుగా నివాళి ధనవతి, ప్లేన్, నివాళి దనవతి కడ్డి, శంభు ప్లేన్, శంబు కడ్డి, నిపాణి ప్లేన్ బార్డర్లతో చీరలను తయారు చేసి, మార్కెట్లో పోటీ పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి పుణే, ముబై, సాంగ్లీ, షోలాపూర్, గుల్బర్గా, యాద్గీర్, నాగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు పట్టు, కాటన్ చీరలు ఎగుమతి అవుతుంటాయి. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది చేనేత కార్మికులున్నారు. గత ప్రభుత్వం 735 మగ్గాలకు జీయో ట్యాగింగ్ చేసింది.
గద్వాల జరీకి అంతర్జాతీయ గుర్తింపు
గద్వాల చేనేత జరీ చీరలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. సంసృతి సంప్రదాయాలకు గద్వాల చీర బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందింది. గద్వాల జరీ చీరలను కాటన్‌బాడీ, బార్డర్, కొంగులో చిలుకు(జరీ) కలిపి తయారు చేస్తారు. అందుకే గద్వాల జరీ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది. అయితే గత పదేళ్ల నుంచి గద్వాల జరీ చీరలు మార్కెట్ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. మహిళల అభిరుచులు మారిపోవడం, తక్కువ బరువున్న చీరలకు ప్రాధాన్యం పెరగడం, ఆధునిక డిజైన్లున్న చీరలవైపు మహిళలు మొగ్గు చూపుతుండటం కొంత ఇబ్బందిగా మారింది. అయినా లెనిన్, జ్యూట్, టస్సర్ వంటి వివిధ రకాల చిలుకుతో తయారు చేస్తున్న జరీ చీరలకు డిమాండ్ బాగానే ఉంది. మాస్టర్ వీవర్స్ కూడా పవర్ లూమ్‌లో తయారైన చీరలను, గద్వాల జరీ చీరలుగా విక్రయిస్తుండటం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో ఇక్కడి కార్మికులకు ఉపాధి లభించడం కష్టంగా మారింది.
10 వేల మంది చేనేత కార్మికులు
గద్వాల పట్టణంలో దాదాపు 320 జియో ట్యాగింగ్ మగ్గాలున్నాయి. గట్టు, మాచర్ల, ఆరిగిద్ద, అయిజ, రాజపోలి, ఎక్లాస్‌పూర్, గొర్లఖాన్‌దొడ్డి, అనంతపూర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 3,400 జియో మగ్గాలుండగా, ట్యాంగింగ్ లేని మగ్గాలు 600 వరకు ఉన్నాయి. దాదాపు 10 వేల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వారిని ప్రోత్సహించి, వృత్తికి భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ డెవలప్‌మెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్సైటైల్స్ ఆధ్వర్యంలో వీవర్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా సబ్సిడీపై జుకార్డ్స్ ఎలక్ర్టానిక్ యంత్రాలను అందిస్తోంది. ప్రస్తుతం గద్వాలకు ఎనిమిది యంత్రాలను అందించింది. దీని ద్వారా ఎక్కువ డిజైన్లతో జరీ చీరలను నేసే అవకాశం లభించింది. కార్మికులందరికీ వీటిని అందిస్తే గద్వాల చేనేతలు పునర్‌వైభవం సంతరించుకునే అవకాశం ఉంది.
పురస్కారానికి ఎంపికైన 8 మంది
నారాయణపేట/ అమరచింత/ గద్వాల/ రాజోలి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి 8 మంది నేత కార్మికులు ఎంపికయ్యారు. వారిలో నారాయణపేట జిల్లా నుంచి ఇద్దరు, వనపర్తి జిల్లా నుంచి నలుగురు, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన యంగలి ఆంజనేయులు డిజైనింగ్ విభాగంలో, చిన్నజట్రం గ్రామానికి చెందిన ఆంజనేయులుకు మక్స్‌డ్ ఫాబ్రిక్ నేత విభాగంలో అవార్డు అందుకోనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా, రాజోలికి చెందిన సూర్య వెంకటేశ్ రెండు రంగుల నూలు దారాలు, జాకార్డ్ బార్డర్, అంచులకు మీన బుట్టలు, కంగుకు అంచుపట్టీతో కాటన్ చీర తయారు చేసి అవార్డుకు ఎంపికయ్యారు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన మాదుగుండ లక్ష్మి టర్నింగ్ బార్డర్‌లో మీన బుట్ట, చీరకు ఒక వైపు చిన్నది, మరో వైపు పెద్ద అంచులతో పట్టుచీర నేసి పురస్కారానికి ఎంపికయ్యారు.
వనపర్తి జిల్లా, అమరచింతకు చెందిన మహంకాళి సులోచన అమేషా డీర్ బూటా బార్డర్‌తో చేర నేసి పురస్కారానికి ఎంపికయ్యారు. దేవరకొండ లచ్చన్న సైడ్ లూమ్ సిల్క్ శారీ రూపొందించి అవార్డు పొందారు. ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామానికి చెందిన షీలా గుడ్డన్న కొమ్మ బూటా సైడ్ డిజైన్‌తో చీరను నేసి అవార్డుకు ఎంపికయ్యారు. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన సారంగి రాములు పికాక్, టెంపుల్ బార్డర్‌తో చీరను రూపొందించి రాష్ట్రస్థాయిలో రాణించారు.