Share News

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:30 PM

ఏళ్లతరబడి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

- టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌

గద్వాల సర్కిల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏళ్లతరబడి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గద్వాలలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆదివారం జరిగిన యూనియన్‌ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. నూతన విద్యా విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ విధానం అమలు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఈపీ-2020ని రద్దు చేసే వరకు యూనియన్‌ పోరాటం కొనసాగిస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పెన్షన్‌ బిల్లుతో పెన్షన్‌దారులకు తీరని నష్టం జరుగుతుందని వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పథక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. యూనియన్‌ రాష్ట్ర మాజీ కోశాధికారి కిష్టయ్య, జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ప్రధాన కార్యదర్శి గోపాల్‌, నాయకులు కుమార్‌నాయుడు, బీసన్న, రామన్‌గౌడ్‌, తిమ్మప్ప, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:30 PM