Share News

అద్వితీయం ప్రగతి పథం

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:20 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 12 స్థానాల్లో ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించారు.

అద్వితీయం ప్రగతి పథం
వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి(ఫైల్‌)

రెండేళ్లలో మెజారిటీ నియోజకవర్గాలకు భారీగా నిధులు

శంకుస్థాపనలు చేసినా.. కొన్ని పనుల ప్రారంభంలో జాప్యం

సీసీరోడ్లు, డ్రైౖనేజీలకు భారీగా ఖర్చు.. పట్టణాభివృద్ధికి ప్రణాళికలు

ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు మంజూరైనా ప్రారంభం కాని నిర్మాణాలు

పీయూకు ఇంజనీరింగ్‌, లా కాలేజీలు.. పాలమూరుకు ట్రిపుల్‌ ఐటీ

మహబూబ్‌నగర్‌కు నవోదయ.. వనపర్తి జిల్లాకు కేంద్రీయ పాఠశాల

పట్టాలెక్కుతున్న మక్తల్‌- ‘పేట’- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 12 స్థానాల్లో ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించారు. వారి మద్దతుతో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. పార్లమెంట్‌ ఎన్నికల నుంచి మొదలుకుని ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వరకు 20 కంటే ఎక్కువగానే ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ప్రతీసారి ఏదో ఒక అభివృద్ధి పని శంకుస్థాపనకు పూనుకుంటున్నారు. మొదటగా తన నియోజకవర్గం కొడంగల్‌లో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ మంజూరు చేసుకున్నారు. తన చిరకాల కోరిక అయిన మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల పైచిలుకు కోట్లు మంజూరు చేసుకుని, పనులకు ఇటీవల మక్తల్‌లో శంకుస్థాపన చేశారు. అలాగే మక్తల్‌ నుంచి నారాయణపేట రోడ్డుకు రూ.200 కోట్లు, భీమా కాలువల పునరుద్ధరణకు రూ.100 కోట్లు, ఆత్మకూరు ఆస్పత్రిలో వంద పడకల ఆస్పత్రి ఇలా.. ఆ ఒక్కరోజే మక్తల్‌ నియోజకవర్గంలో రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

భారీగా నిధులు మంజూరు

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క అలంపూర్‌, నాగర్‌కర్నూల్‌ మినహా అన్ని నియోజకవర్గాలను సీఎం చుట్టేశారు. మెజారిటీ నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజూరయ్యాయి. సంక్షేమ పథకాలు కాకుండా వనపర్తికి రూ.1,457 కోట్లు, కల్వకుర్తికి రూ.1,176 కోట్లు, మక్తల్‌కు రూ.1,038 కోట్లు, మహబూబ్‌నగర్‌కు సుమారు రూ.1,500 కోట్లు, దేవరకద్రకు రూ.1,000 కోట్లు, జడ్చర్లకు సుమారు రూ.1,000 కోట్లు మంజూరయ్యాయి. నారాయణపేట జిల్లాకు రూ.751 కోట్ల వరకు నిధులు వచ్చాయి. అచ్చంపేట నియోజకవర్గానికి సుమారు రూ.500 కోట్ల, కొల్లాపూర్‌ నియోజకవర్గానికి రూ.895 కోట్ల వరకు నిధులు ఇచ్చారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలకు తక్కువగా మంజూరయ్యాయి.

శంకుస్థాపనలు చేసినా..

వస్తున్న జీవోలు, జరుగుతున్న శంకుస్థాపనలను బట్టి నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజూరైనప్పటికీ.. చాలావరకు పనులు టెండర్లు దాటి ముందుకుపోవడం లేదు. ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొన్ని టెండర్ల దశల్లో ఉండగా.. మరికొన్ని టెండర్ల వరకు కూడా చేరుకోవడం లేదు. అయితే టీయూఎ్‌ఫఐడీసీ, యూఐడీసీ కింద పట్టణాలకు మంజూరైన నిధులతో చాలావరకు సీసీ రోడ్లు, ఓపెన్‌ డ్రెయినేజీలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలు పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతో కేంద్ర సహకారంతో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి రూ.824 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. అలాగే అమృత్‌ పథకం కింద రూ.226 కోట్లు వచ్చాయి.

సీసీ రోడ్లు, డ్రెయినేజీలపై ఎమ్మెల్యేలు ఫోకస్‌

ఈ రెండేళ్లలో ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలపై ఎమ్మెల్యేలు ఫోకస్‌ పెట్టినట్లు స్పష్టమవుతోంది. పంచాయతీల్లో కూడా ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద సీసీ రోడ్లు, డ్రెయినేజీలు భారీగానే నిర్మించారు. ఇప్పుడు కొత్త పాలకవర్గాలు వస్తే మరిన్ని నిధులు మౌలిక వసతుల కోసం వెచ్చించే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి అమృత్‌ పథకం కింద తాగునీటి వ్యవస్థ బలోపేతానికి కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయి.

కొత్త విద్యాసంస్థలు..

కొత్తగా ఆసుపత్రుల మంజూరుతోపాటు ఎక్కువగా కొత్త విద్యా సంస్థలు ఈ రెండేళ్లలో ఎక్కువగానే మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, మహబూబ్‌నగర్‌కు ట్రిపుల్‌ ఐటీ మంజూరు అయ్యింది. పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌, లా కాలేజీలు, కొడంగల్‌ మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ, గద్వాల, నారాయణపేట మెడికల్‌ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. జడ్చర్లలో నవోదయ విద్యాలయం, వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు రెండూ ఎంపీల సహకారంతో మంజూరైనట్లు చెప్పొచ్చు. కృష్ణా-వికారాబాద్‌ రైల్వేలైన్‌ కొలిక్కి రావడంతో భూసేకరణ కోసం రూ.438 కోట్లు మంజూరయ్యాయి. ఉదండాపూర్‌ ముంపు బాధితులకు పరిహారం పెంపు, కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం ఇవ్వడం మెరుగైన అంశాలుగా చెప్పవచ్చు.

పురోగతి లేని ఇరిగేషన్‌

ఇరిగేషన్‌ విషయానికి వస్తే కొడంగల్‌ ఎత్తిపోతల మినహా ఏ పథకం అనుకున్నంత పురోగతి సాధించలేదు. పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్‌ పనులు నత్తనడకన సాగుతుండటం.. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, తుమ్మిళ్ల పనుల సమీక్ష జరిగినా ముందుకు సాగడం లేదు. వీటికి గ్రీన్‌చానల్‌ నిధులు అని సీఎం ప్రకటించినప్పటికీ ఆ మేరకు విడుదల కావడం లేదు. మక్తల్‌లో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ తీర్మానం చేసింది. విద్యుత్‌ రంగానికి సంబంధించి కొత్తగా 133 కేవీ సబ్‌ స్టేషన్లు, 11 కేవీ సబ్‌ స్టేషన్లు అధికంగా మంజూరయ్యాయి. జూరాల ప్రాజెక్టు దిగువన దాదాపు రూ. 121 కోట్లతో బ్రిడ్జి, అలాగే రూ.100 కోట్ల పైచిలుకు నిధులతో కురుమూర్తి స్వామి కొండకు ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు మంజూరైంది. ఆ పనులు నడుస్తున్నాయి.

అభివృద్ధే లక్ష్యం

కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలు నన్ను 6 పర్యాయాలుగా ఆదరించి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిపించారు. ఏమిచ్చినా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేను. నా శ్వాస ఉన్నంత వరకు కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా పాలనలో భాగంగా ఇప్పటికే రెండేళ్లలో రూ.800 కోట్ల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. భవిష్యత్‌ రోజుల్లో పాలమూరు జిల్లాలోనే అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ నియోజకవర్గం అనే స్థాయిలో నిలబెడతా.

- జూపల్లి కృష్ణారావు, మంత్రి, కొల్లాపూర్‌

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

మక్తల్‌ నియోజకవర్గాన్ని రాబోయే మూడేళ్లలో ఆత్మకూర్‌, మక్తల్‌ రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గంలో బీటీరోడ్లు, సీసీరోడ్లు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తాం. ఈ ప్రాంతంలో కృష్ణమ్మ చెంతనే ఉండటంతో ఎత్తిపోతల పథకాలు అందించి సాగునీరందించేందుకు కృషి చేస్తా. సంగంబండ వద్ద చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ముంపు గ్రామాల్లో అన్ని హంగులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గ సంక్షేమంకోసం ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా మంజూరు చేయిస్తాను.

- వాకిటి శ్రీహరి, మంత్రి, మక్తల్‌

Updated Date - Dec 06 , 2025 | 11:20 PM