నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:53 PM
బతుకు దేరువు కోసం పట్నం పోయిన ఓ కుటుంబం వినాయక నిమజ్జనం పండుగను పుట్టిన ఊరిలో జరుపుకుందామని వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఇద్దరు కన్న బిడ్డలను కోల్పోయింది.
వినాయక నిమజ్జనం కోసం గ్రామానికి వచ్చి మృత్యువాత
చిన్నారులను కబళించిన ఇందిరమ్మ ఇంటి గుంత
ఊట్కూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో ఘటన
ఊట్కూర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : బతుకు దేరువు కోసం పట్నం పోయిన ఓ కుటుంబం వినాయక నిమజ్జనం పండుగను పుట్టిన ఊరిలో జరుపుకుందామని వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఇద్దరు కన్న బిడ్డలను కోల్పోయింది. ఇంటి పక్కన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల కోసం తీసిన నీటి గుంత వారిని కబళించిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం తిమ్మారెడ్డి పల్లి తండాకు చెందిన గోబ్రియానాయక్, తారమ్మ దంపతుల కుమారుడైన పునియానాయక్ బతుకుదేరువు కోసం హైదరాబాద్ నగరంలో ఆటో నడపుతూ భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. గ్రామంలో వినాయక నిమజ్జనం పండుగ ఉన్నదని తల్లి తారమ్మ రమ్మని చెప్పడంతో మంగళవారం రాత్రి భార్య ఇద్దరు కుమారులు అభి (5), వికాస్ (3)ను తీసుకొని ఆటోలో గ్రామానికి వచ్చాడు. ఉదయం పునియానాయక్ నారాయణపేటకు వెళ్ళగా, భార్య జయమ్మ, తల్లి తారమ్మలు ఇంట్లో ఉన్నారు. వారి ఇద్దరు కుమారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా పిల్లలు రాలేదని తల్లి జయమ్మ తండా మొత్తం వెతికినా కనిపించలేదు. రెండవ సారి గ్రామంలో వెతికి తిరిగి వస్తుండగా ఇంటి పక్కనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన నీటి గుంతలో ఇద్దరు చిన్నారులు పైకి తేలడం చూసి గుర్తించిన తల్లి ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. గుంతలోకి దిగి పిల్లలను బయటికి తీసింది. అప్పటికే చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారులను పరిశీలించగా ఇద్దరూ మృతి చెందారు. చిన్నారుల మృతితో వినాయక నిమజ్జనం వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేస దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.