Share News

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , Publish Date - May 24 , 2025 | 10:59 PM

మేకలను మేపడానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన గోపాల్‌పేట మండలం నర్సింగాయిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

- గోపాల్‌పేట మండలం నర్సింగాయపల్లిలో విషాదం

గోపాల్‌పేట, మే 24(ఆంధ్రజ్యోతి) : మేకలను మేపడానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన గోపాల్‌పేట మండలం నర్సింగాయిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గగనం వెంకటయ్య, కృష్ణమ్మ దంపతులకు కుమార్తె లిల్లీ (10) కుమారుడు గణేష్‌ (8) ఇద్దరు పిల్లలు. తండ్రి వెంకటయ్య గత 8 నెలల క్రితం అదే గ్రామ శివారులో చెట్టు మీద నుంచి కిందపడి మృతి చెందాడు. తల్లి కృష్ణమ్మ కూలీ పనులు చేసుకుంటూ.. ఐదు మేకలను కొనుగోలు చేసి కుమార్తె, కుమా రుడితో మేతకు పంపేది. అలా శనివారం కూడా అక్క తమ్ముడు ఇద్దరు మేకలను మేతకు తీసుకుని వెళ్లారు. సాయంత్రం 7 గంటలైనా ఇద్దరు చిన్నారులు ఇంటికి రాకపోవడంతో, తల్లి చుట్టుపక్కల ఉన్న వారితో కలిసి గ్రామ సమీపంలో వెతికి పక్కనే ఉన్న కుంట దగ్గరికి వెళ్లి చూశారు. కుంట సమీపంలో వారి చెప్పులు పడి ఉండటం చూసి వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వారు ఫైర్‌ సిబ్బందికి తెలుపడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 2 గంటలకు పైగా శ్రమించిన ఫైర్‌ సిబ్బంది కుంటలో ఇద్దరు చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. కాగా, ఉదయం 10 గంటల వరకు కళ్ల ముందు ఉన్న చిన్నారులు సాయంత్రం వరకు శవాలుగా ఇంటికి రావడంతో తల్లి కృష్ణమ్మ గుండెలు పగిలేల రోదించింది. గత 8 నెలల కిందట భర్త, ఇప్పుడు చిన్నారులు మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె పరిస్థితి తయారైంది.

Updated Date - May 24 , 2025 | 10:59 PM