Share News

పాలమూరుకు ట్రిపుల్‌ ఐటీ

ABN , Publish Date - May 03 , 2025 | 11:09 PM

పాలమూరు విద్యా కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ఇప్పటికే పాలమూరుకు న్యాయ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఏటీసీ, స్కిల్‌ డెవల్‌పమెంంట్‌ సెంటర్‌ మంజూరు కాగా, త్వరలో ట్రిపుల్‌ ఐటీ కళాశాల మంజూరు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు రెండు లేదా మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

పాలమూరుకు ట్రిపుల్‌ ఐటీ
రెడ్డి హాస్టల్‌ సమీపంలో స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే, వీసీ, అధికారులు

రెండు లేదా మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు

స్థల పరిశీలన చేసిన బాసర ట్రిపుల్‌ ఐటీ వైస్‌ ఛాన్సలర్‌

న్యాయ, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఇప్పటికే మంజూరు

కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం

మహబూబ్‌నగర్‌, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరు విద్యా కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ఇప్పటికే పాలమూరుకు న్యాయ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఏటీసీ, స్కిల్‌ డెవల్‌పమెంంట్‌ సెంటర్‌ మంజూరు కాగా, త్వరలో ట్రిపుల్‌ ఐటీ కళాశాల మంజూరు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు రెండు లేదా మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ ఆధ్వర్యంలో శనివారం పలుచోట్ల స్థల పరిశీలన చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు రెండు మాత్రమే ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. అవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవే. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. కానీ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే వనపర్తిలో ఒక జేఎన్‌టీయూ కళాశాలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో తక్కువగా ఉండటం, పాలమూరు యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ కాలేజీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పీయూకు అనుబంధంగా ఇంజనీరింగ్‌ కాలేజీని మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందులో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాల లేకపోవడంతో దాన్ని కూడా పీయూకు అనుబంధంగా ఏర్పాటు చేసి, ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. తాజాగా పాలమూరుకు ట్రిపుల్‌ ఐటీ మంజూరు కానుండటంతో విద్యార్థులకు మేలు జరగనుంది.

మారనున్న ముఖచిత్రం..

ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండగా.. ఇంజనీరింగ్‌, లా కాలేజీలు మంజూరయ్యాయి. దీంతోపాటు అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ సెంటర్లు, స్టడీ హాళ్లు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లు మంజూరయ్యాయి. ఒక ఇంటిగ్రేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కూడా మంజూరైంది. తాజాగా ట్రిపుల్‌ ఐటీకి స్థల పరిశీలన చేయడంతో రానున్న రోజుల్లో పాలమూరు ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తన ఎన్నికల హామీల్లో భాగంగా జాతీయ స్థాయి విద్యా సంస్థను నెలకొల్పేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ట్రిపుల్‌ ఐటీ మంజూరయితే ఆ హామీ నెరవేరనుంది. గతంలో హైదరాబాద్‌, బాసరలో మాత్రమే ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండగా.. మరొకటి పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షి్‌పలో కొనసాగుతోంది. పాలమూరుకు మంజూరయ్యే ట్రిపుల్‌ ఐటీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఏటా ఇంజనీరింగ్‌ చదువుల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు విద్యార్థులు వలస వెళ్తున్నారు. ఇప్పుడు వనపర్తిలో జేఎన్‌టీయూహెచ్‌, కొడంగల్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ, పాలమూరులో ఇంజనీరింగ్‌ కాలేజీలు వచ్చాయి. ట్రిపుల్‌ ఐటీ వస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉన్నతస్థాయి విద్య అందడంతోపాటు వివిధ కంపెనీల్లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు కొలువులు సులభంగా లభిస్తాయని చెప్పొచ్చు.

50 ఎకరాల్లో ఏర్పాటు..

ట్రిపుల్‌ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయనుండగా.. ముందుగా స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. కార్పొరేషన్‌ పరిధిలోనే ఈ విద్యాసంస్థ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కనీసం 40 నుంచి 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కళాశాల భవనం, ల్యాబ్‌లు, వర్క్‌షాపులు, లైబ్రరీలు, స్టాఫ్‌ క్వార్టర్లు, విద్యార్థుల వసతి గృహాలు, సెమినార్‌ హాల్స్‌ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ ఆధ్వర్యంలో అధికారులు శనివారం పలు ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. పాలమూరులోని దివిటిపల్లి, రాజ బహదూర్‌ వెంకట్‌ రాంరెడ్డి హాస్టల్‌ సమీపంలో బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ బృందం, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డితో కలిసి స్థల పరిశీలన చేశారు. వీటితోపాటు మరిన్ని స్థలాలు గుర్తించాలని, ఏది అనువుగా ఉంటుందో దాన్ని ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే కలెక్టర్‌ విజయేందిర బోయికి సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పి.వినోద్‌ కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ రెడ్డి, మూడా చైర్మన్‌ లక్షణ్‌ యాదవ్‌, అవేజ్‌, కృష్ణయ్య యాదవ్‌, సంజీవ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

కష్టం ఫలించింది

పాలమూరులో ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ నెలకొల్పుతానని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీ నెరవేరేందుకు మార్గం సుగుమమైంది. రెండు మూడు రోజుల్లో జీవో వెలువడుతుంది. ఈ మేరకు బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ స్థల పరిశీలన కూడా చేశారు. ఇప్పటికే పాలమూరుకు న్యాయ కళాశాల, ఇంజనీరింగ్‌ కాలేజీ మంజూరయ్యాయి. ఈ కళాశాల ఏర్పాటు కోసం చేసిన కష్టం ఫలిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు ఆయన ధన్యవాదాలు.

- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే

Updated Date - May 03 , 2025 | 11:09 PM