Share News

పారదర్శకంగా ప్రజా పాలన

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:33 PM

ప్రజా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.

  పారదర్శకంగా ప్రజా పాలన
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి

- 79వ స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి

- విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేయాలని పిలుపు

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. పైరవీలతో ప్రమేయం లేకుండా ప్రతీ సంక్షేమ పథకం పేదలకు గడపకు తాకాలని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర స్ఫూర్తితో అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేయాలని అన్ని వర్గాల ప్రజలకు ఆయన అభ్యర్థించారు. 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అమరేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్లు జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు 550పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ఇటీవల శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా 768పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 6కోట్ల 27లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.

రైతు భరోసా కింద 464కోట్ల 88లక్షల రూపాయల జమ

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద జిల్లాలో ఇప్పటి వరకు 464కోట్ల 88లక్షల రూపాయలు 3లక్షల 6వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చిన్నారెడ్డి తెలిపారు.. రుణమాఫీలో లక్షా 9వేల 206మంది రైతులకు 920కోట్ల 63లక్షల రూపాయల ప్రయోజనం చేకూరిందన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద అమ్రాబాద్‌ మండలంలోని మాచారంలో ఈ పథకానికి అంకురార్పణ చేసి నల్లమల ప్రాంతానికంతా విస్తరిస్తున్నట్లు చెప్పారు.

ఎంజీఎల్‌ఐ, పాలమూరు-రంగారెడ్డి పథకాలతో మహర్దశ

జిల్లాలో మహాత్మాగాంధీ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి పథకాల ద్వారా వ్యవసాయానికి మహర్దశ ఏర్పడనుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఎంజీఎల్‌ఐ ద్వారా ఇప్పటి వరకు 3లక్షల 7వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని, పూర్తిస్థాయిలో 4లక్షల 51వేల ఎకరాలకు సాగునీరందించేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే కృతనిశ్చయంతో ఉందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. 2024-25ఆర్థిక సంవత్సరంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వంద శాతం రాయితీపై 82లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చెరుకూరు గ్రామ మహిళా సంఘానికి చేపలు అమ్ముకోవడానికి 10లక్షల రూపాయల ఖర్చుతో వాహనాలను అందించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 68వేల 470కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని, 74వేల 593మందిని పాత కార్డుల్లో అదనంగా చేర్చే ప్రక్రియ పూర్తైందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 586 దరఖాస్తులు రాగా 56వేల 380దరఖాస్తులను గుర్తించి ఇప్పటి వరకు 11వేల 622ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ నాయకులు కొండా నగేష్‌, వంకేశ్వరం నిరంజన్‌, హబీబ్‌, ధర్మరాజు, కోటయ్య, శ్రీపురం నరసింహారెడ్డి, నాగనూల్‌ కృష్ణారెడ్డి, పెద్దకొత్తపల్లి మాజీ జడ్పీటీసీ మురళీధర్‌, పిడికళ్ల పాపమ్మ, మలిశెట్టి పద్మమ్మ, జక్కారాజ్‌, ఎండి.నిజాం పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:33 PM