నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ABN , Publish Date - May 12 , 2025 | 10:39 PM
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ, అకడమిక్ మానిటరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆయా జిల్లాల్లో విడతల వారీగా..
స్కూల్ అసిస్టెంట్‌లకు జిల్లా కేంద్రాల్లో..
ఎస్‌జీటీలకు మండల కేంద్రాల్లో ట్రైనింగ్
ఉమ్మడి జిల్లాలో 3,227 ప్రభుత్వ స్కూల్స్
12,854 మంది ఉపాధ్యాయులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/నారాయణపేట, మే 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ, అకడమిక్ మానిటరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత శిక్షణ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ ఉదయం 9:30 నుంచి సాయత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉపాధ్యాయుల హాజరు ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటారు. శిక్షణకు ఎవరూ డుమ్మా కొట్టకుండా కేంద్రాల్లో జియోట్యాగింగ్ ఏర్పాటు చేశారు. శిక్షణకు హాజరయ్యే టీచర్లకు మఽధ్యాహ్న భోజనంతోపాటు రెండు పూటలా టీ, స్నాక్స్ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ స్కూల్ అసిస్టెంట్లకు రెండు విడతల్లో జిల్లా కేంద్రాల్లో ఇవ్వనున్నారు. ఎస్‌జీటీలకు మండల కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి నిర్వహించనున్నారు.
జిల్లా కేంద్రాల్లో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,854 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఇచ్చే శిక్షణకు మహబూబ్‌నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరజూల్లా ఖాన్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఏఎంవోల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగనుంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 750 మందికి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో గల జేపీఎన్‌ఎ్‌స కళాశాలలో మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు మొదటి విడత శిక్షణ ఇవ్వనున్నారు. స్కూల్ అసింటెంట్స్ ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, గణితం సబ్జెక్టులతో పాటు మండల స్థాయిలో ఎస్‌జీటీలకు శిక్షణ ఇచ్చే డీఆర్పీలకు కూడా శిక్షణ ఇస్తారు. జిల్లాలో 750 మంది ఉపాధ్యాయులు శిక్షణకు హాజరు కానున్నారు. అందులో 690 మంది స్కూల్ అసిస్టెంట్స్, 60 మంది మండల స్థాయిలో ఎంఆర్‌పీలుగా శిక్షణ ఇవ్వనున్న ఎస్‌జీటీలు ఉన్నారు.