Share News

నల్లమలలో ట్రైనీ ఐఏఎస్‌లు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:06 PM

దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతాన్ని ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందం బుధవారం పర్యటించింది.

నల్లమలలో ట్రైనీ ఐఏఎస్‌లు
మన్ననూరు పర్యావరణ మ్యూజియం వద్ద అటవీ అధికారులతో శిక్షణ ఐఏఎస్‌లు

- పర్హాబాద్‌ వ్యూపాయింట్‌ సందర్శన

- వనవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలు పరిశీలన

- అభయారణ్యంలో అభివృద్ధి పనులపై అధ్యయనం

మన్ననూర్‌/ దోమలపెంట, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతాన్ని ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందం బుధవారం పర్యటించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐఏఎస్‌ - 2024 బ్యాచ్‌ అధికారులు శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ దర్శన్‌లో భాగంగా వారిలో సౌరభ్‌ శర్మ, సలోని చబ్రా, హర్ష్‌ చౌదరి, కరోలియన్‌ చింగ్‌తిఅన్మవి, కొయ్యడ ప్రణయ్‌ కుమార్‌లు నల్లమల ప్రాంతంలో క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చారు. డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి నేతృత్వంలో వారికి మన్ననూరు వనమాలిక వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇకో టూరిజంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్‌ సఫారీ, కాటేజీలు, జ్యూట్‌ బ్యాగుల తయారీ కేంద్రం, బయోల్యాబ్‌లను పరిశీలించారు. నల్లమల ప్రాంతంలో ప్లాస్టిక్‌ నిషేధానికి తీసుకుంటున్న చర్యలను అటవీ శాఖ అధికారులు వారికి వివరించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్య స్వరూపం, వన్యప్రాణులు, అడవిలో నివసించే చెంచుల పూరిళ్లు, వారి జీవన విధానాన్ని తెలిపే చిత్ర ప్రదర్శనను తిలకించారు. అమ్రాబాద్‌ పులుల అభయారణ్య విశేషాలను డిజిటల్‌ తెరపై చూశారు. అనంతరం సఫారీ వాహనాల్లో పర్హాబాద్‌ వ్యూపాయింట్‌కు వెళ్లి కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత పునరావాస ప్యాకేజీ అమలు చేస్తున్న వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాలను పరిశీలించారు. స్థానికులు, అధికారులతో మాట్లాడి అటవీశాఖ తరఫున కల్పించనున్న వసతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణలో భాగంగా రెండు రోజుల పాటు నల్లమలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఒక్కడి ప్రజల జీవన విధానం, ఉపాధి అవకాశాలు, నల్లమల అడవుల అభివృద్ధి, పునరావాస గ్రామాల తరలింపు ప్రక్రియ, వారికి కల్పించే వసతులను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని గ్రామస్థులకు తెలిపారు. అక్కడి నుంచి ఆక్టోపస్‌ వ్యూపాయింట్‌, శ్రీశైలం డ్యామ్‌లను సందర్శించి, రాత్రికి శ్రీశైలం క్షేత్రానికి చేరుకోనున్నారు.

రెండవ రోజు పర్యటన సాగేదిలా..

జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సోమశిల పర్యాటక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు. అధికారుల విధులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించనున్నట్లు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నోడల్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో అటవీ రేంజ్‌ అధికారి వీరేశం, బయాలజిస్టు మహేందర్‌, సెక్షన్‌ అధికారి శ్రీకాంత్‌, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌ఎస్‌వోలు ధర్మనాయక్‌, రామాంజనేయులు, బీట్‌ ఆఫీసర్లు మధుసూదన్‌, తేజీశ్రీ, శిల్ప, పునరావాస గ్రామ కమిటీ సభ్యులు, కరీం, మల్లేశ్‌, జగదీశ్‌, ఫయిముల్లా షరీఫ్‌, రాములు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:06 PM