బోర్లు వేశారు... మోటార్లు మరిచారు
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:48 PM
గత ప్రభుత్వం గిరిజన రైతులకు ఆర్థిక స్వావలంబన తీసుకురావడం, సాగుకు యోగ్యంకాని భూములను అభివృద్ధి చేయడం కోసం అప్పటికే అమలులో ఉన్న ఇందిర జలప్రభ పథకం స్థానంలో సీఎం గిరి వికాసం పథకాన్ని చేపట్టింది.
- నిధులు లేక నిలిచిన విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు
- ప్రభుత్వం మారడంతో అటకెక్కిన సీఎం గిరి వికాసం
- దాని స్థానంలో ఇందిర సౌరగిరి జలవికాసం అంతంతే..
- 11,559 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చేలా పథకం
మహబూబ్‌నగర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గత ప్రభుత్వం గిరిజన రైతులకు ఆర్థిక స్వావలంబన తీసుకురావడం, సాగుకు యోగ్యంకాని భూములను అభివృద్ధి చేయడం కోసం అప్పటికే అమలులో ఉన్న ఇందిర జలప్రభ పథకం స్థానంలో సీఎం గిరి వికాసం పథకాన్ని చేపట్టింది. దీని ద్వారా వృథాగా ఉన్న గిరిజన రైతుల భూములను సాగుకు అనువుగా మార్చడం, బోర్లు వేసి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లు బిగించాల్సి ఉంది. 2017లో ఈ పథకాన్ని ప్రారంభించగా, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ట్రైకార్, గ్రామీణాభివృద్ధి శాఖల నేతృత్వంలో పనులు చేపట్టారు. రాష్ట్రంలో 11,599 మంది గిరిజన రైతులకు చెందిన 33,667 ఎకరాల భూములను ఈ పథకం కింద సాగు భూములుగా మార్చాల్సి ఉంది. అయితే అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాలా వరకు బోర్లు వేశారు. దీనికింద రూ. 52.68 కోట్లు ఖర్చు చేయాలని భావించినప్పటికీ గత ప్రభుత్వం ఆరంభంలో చూపించిన శ్రద్ధ తర్వాత చూపలేదు. దీంతో బోర్లు వేసినప్పటికీ తర్వాత చేయాల్సిన పనులను చేపట్టలేదు. కొందరు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బోర్లు వేయడంలో తీవ్రమైన అవినీతికి కూడా పాల్పడినట్లు గతం నుంచే ఆరోపణలు ఉన్నాయి. బోర్లు వేయకుండానే వేసినట్లుగా రికార్డులను సృష్టించి బిల్లులు కాజేసినట్లు విమర్శలున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఆ పథకం కింద బోర్లు వేసుకున్న వారు విద్యుత్ కనెక్షన్, మోటార్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఇచ్చిన సమయంలోనూ గత ప్రభుత్వం సుమారు మరో 37,987 మంది గిరిజన రైతులకు ఈ పథకం కిందనే లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. అది కూడా ఆచరణ సాధ్యం కాలేదు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం మారడంతో సీఎం గిరి వికాసం పథకం పూర్తిగా అటకెక్కినట్లయ్యింది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి
వాస్తవానికి ఈ పథకం ప్రారంభించినప్పుడు రూ. 52.68 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఒకవేళ కొంత మేర అంచనాలు పెరిగినా, పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి జరిగేది. కానీ ఆ దిశగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ చేతివాటం మాత్రం ప్రదర్శించారు. ఉదాహరణకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం గిరి వికాసం పథకం కింద 1,136 బోర్లను వేయించగా, 79 బోర్లు ఫెయిల్ అయ్యాయి. 1,057 బోర్లు విజయవంతమయ్యాయి. వీటన్నింటికీ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసి ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లను బిగించాల్సి ఉంది. అలాగే సదరు గిరిజన రైతుకు సంబంధించిన భూమిలో బండరాళ్లను తొలగించడం, జంగల్ కటింగ్ చేసి చదును చేయడం తదితర పనులను చేపట్టాల్సి ఉంది. కానీ ఈ పనులు పూర్తి స్థాయిలో చేపట్టలేదు. మొత్తం 1,057 బోర్లకు గాను కేవలం 489 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మోటార్లను కూడా అన్ని బోర్లలో దించలేదు. కేవలం 268 బోర్లలో మాత్రమే మోటార్లను దించారు. మిగతా వాటిని వదిలేశారు. దీంతో బోర్లు వేసుకున్న రైతులు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
సౌర గిరిజల వికాసం అంతంతే..
రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాత పథకమైన సీఎం గిరి వికాసం అటకెక్కింది. అయితే ఆ స్థానంలో మరింత మందికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే చేపట్టింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి మే 18న 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ను రూ.12,600 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఒక్కో యూనిట్ కోసం రూ. 6 లక్షలు కేటాయించారు. మాచారం గ్రామంలో 55 చెంచు కుటుంబాలు ఉండగా, మొదటి విడతగా అందులో 26 కుటుంబాలను ఎంపిక చేసి, 16 బోర్లు వేయించారు. సోలార్ మోటార్లు బిగించి పండ్ల మొక్కలు నాటారు. ఈ జిల్లా పరిధిలో 88 చెంచు పెంటలు ఉన్నప్పటికీ సీఎం ప్రారంభ కార్యక్రమం వరకే పథకం పరిమితమైంది. తర్వాత ఎవరూ దాని ఊసు ఎత్తలేదు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో చేపట్టిన సీఎం గిరి వికాసంలో బోర్లు వేసుకున్న రైతులకు అటు ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరకపోగా, ప్రస్తుతం ఇందిర సౌర గిరి జల వికాసం కింద కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అటు పాత పథకం అమలు చేయక, ఇటు కొత్త పథకం అమలులో వేగం పెంచకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బంది పడుతున్నారు.
స్పందన లేదు
రవినాయక్, గిరిజన రైతు, ముత్యాల తండా, జోగుళాంబ గద్వాల జిల్లా : గత ప్రభుత్వంలో సీఎం గిరి వికాసం పథకం కింద నా పొలంలో బోరు వేశారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మోటార్ కూడా బిగిస్తామని చెప్పారు. కానీ, ఇప్పటివరకు కనెక్షన్ ఇవ్వలేదు. మోటార్ బిగించలేదు. ఈ పథకం అమలు కోసం ఎమ్మెల్యే లెటర్ తీసుకొని హైదరాబాద్ ఆఫీసుకు వెళ్లి కలిశాను. కానీ, నిధులు లేవు. వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు. నాతో పాటు మరికొందరు రైతులు కూడా విద్యుత్ కనెక్షన్, మోటార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి మోటార్లు ఇవ్వాలి.
బోరు మాత్రమే వేశారు
రవినాయక్, బోయిన్‌పల్లి తండా, నారాయణపేట జిల్లా : నాకు గతంలో సీఎం గిరి వికాసం పథకం కింద బోరు వేశారు. విద్యుత్ కనెక్షన్ కానీ, మోటార్ కానీ ఇవ్వలేదు. మోటార్ ఏర్పాటు చేస్తే కూరగాయలు పండించి, లబ్ధి పొందాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పటికే మూడు సంవత్సరాలవుతోంది. ఇప్పటి వరకు ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం నుంచి త్వరగా స్పందన వస్తే పని అవుతుంది. లేకపోతే కొత్త పథకంలోనైనా మమ్మల్ని చేర్చాలి.