జిల్లాలో యూరియా కొరత లేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:29 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
- డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ పట్టణంలోని డీసీసీబీలో సింగిల్ విండో చైర్మన్లతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సింగిల్‌విండోల కాల పరిమితిని మరో ఆరు నెలలు గడువు పొడిగించినందుకు మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో, మంగళవారం 64 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయినట్లు వెల్లడించారు. బుధవారం జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో 1,800 మెట్రిక్ టన్నులు, గద్వాల స్టేషన్‌లో 2,600 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ఎంపీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 105 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, వాటికి 60 శాతం, ప్రైవేటు డీలర్లకు 40 శాతం యూరియాను కేటాయించినట్లు చెప్పారు. సింగిల్‌విండోల్లో యూరియా ధర తక్కువగా ఉండడంతో రైతులు బారులు తీరుతున్నారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 85,200 టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 68 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయినట్లు తెలిపారు. యూరియా కొరత తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రతీ రోజు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట కొల్లాపూర్, కొప్పునూరు, తూంకుంట సింగిల్‌విండో చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, నరసింహారెడ్డి, రామన్‌గౌడ్ ఉన్నారు.