కొల్లాపూర్ ప్రజల్లో గుబులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:34 PM
పెద్దపులి దారి తప్పి కొల్లాపూర్ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు.
- దట్టమైన నల్లమల నుంచి దారి తప్పిన పెద్దపులి
- కొల్లాపూర్ నల్లమలలో సంచారం
- ఆందోళనలో కృష్ణా తీర గ్రామాల ప్రజలు, రైతులు
- అప్రమత్తమైన అటవీ అధికారులు
కొల్లాపూర్/పెంట్లవెల్లి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పెద్దపులి దారి తప్పి కొల్లాపూర్ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు. దీంతో కొల్లాపూర్ కృష్ణానదీ తీర ప్రాంతాలు, నల్లమల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన రెండు మూడు రోజుల నుంచి పెద్దపులి కొల్లాపూర్ నల్లమల పరిసరాల్లో సంచరిస్తున్నట్లు వార్తలు వ్యాపించాయి. కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ శివారులో గురువారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు టన్నెల్ దగ్గర తోటల సమీపంలో ఈటాచి డ్రైవర్‌కు పెద్దపులి కంటపడింది. సోమశిల, యంగంపల్లి, అమరగిరి గ్రామాల్లో కూడా పెద్దపులి జాడలు కనిపించాయని, అదే పెద్దపులి దారి తప్పి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ కొల్లాపూర్ రేంజ్ అధికారి హుస్సేన్, ముజిబుగోరి, కాశన్న గుర్తించారు. వ్యవసాయ పొలాల్లో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అఽధికారులు విస్తృతంగా పరిశీలన చేపట్టారు.
వ్యవసాయ పొలాల్లో కనిపించిన పాదముద్రలు ఇతర ఆనవాళ్లను సాంకేతికంగా పరిశీలించి అనంతరం అవి పెద్ద పులికి చెందిన జాడలేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించుకున్నారు. గుర్తించారు. అటవీ అధికారుల అంచనా ప్రకారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న దట్టమైన నల్లమల అడవుల నుంచి పెద్దపులి దారి తప్పి మైదాన ప్రాంతాల్లో ఉన్న అడవుల్లోకి వచ్చి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. నల్లమల గ్రామాల కృష్ణానది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దపులి జాడలను గుర్తించి దాని ఆచూకీ గుర్తించేందుకు సోమశిల రహదారిలో ఉన్న ఈకో పార్కు వద్ద యంగంపల్లి సమీపంలో నల్లమల ప్రాంతాల్లో ఎల్లూరు గ్రామ పరిసరాల్లో అమరగిరి సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. యంగంపల్లిలో ప్రజలకు అవగాహన కల్పించారు. వారి వెంట యంగంపల్లి తండా సర్పంచు గోపి నాయక్, అటవీ శాఖ అధికారులు శశి నవీన్, చోటే పాషా, నాగమల్లి సిబ్బంది తదితరులు ఉన్నారు.