Share News

సర్పంచ్‌ల ముందు సవాళ్లెన్నో..

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:31 PM

సుదీర్ఘ విరామం తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు కోటి ఆశలతో సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలనలో పల్లెలు నీరసించిపోయాయి.

సర్పంచ్‌ల ముందు సవాళ్లెన్నో..
కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌లో రోడ్లపై పారుతున్న నీరు

పల్లెల్లో రెండేళ్లు సాగిన ప్రత్యేక పాలన

వేళ్లూనుకున్న సమస్యలు

ఎన్నికల ప్రచారంలో ఏకరువు పెట్టిన ప్రజలు

డ్రైనేజీలు, వీధిదీపాలు లేక అవస్థలు

చాలాచోట్ల పంచాయతీలకు భవనాలు కరువు

నేడు కొలువుదీరనున్న పాలక వర్గాలు

ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం

సుదీర్ఘ విరామం తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు కోటి ఆశలతో సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలనలో పల్లెలు నీరసించిపోయాయి. ఈ విషయం ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో అభ్యర్థులకు తెలిసింది. వారి ముందు గ్రామాల్లో సమస్యల ముళ్లదారే కనిపిస్తోంది. సవాళ్లను ఎదుర్కొంటూ, పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపై ఉంది.

- మహబూబ్‌నగర్‌ , ఆంధ్రజ్యోతి

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పంచాయతీల్లో కొత్త స ర్పంచ్‌లు సోమవారం బాధ్యతలు చేప ట్టనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,678 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో పాలమూరు జిల్లాలో 423, నాగర్‌కర్నూల్‌లో 460, గద్వాలలో 255, వనపర్తిలో 268, నారాయణపేటలో 272 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో సగానికిపైగా సొంత భవనాలు లేవు. పాత వాటిలోనూ చాలావరకు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. ఉపాధిహామీ నిధులతో కొన్ని గ్రామాలలో మాత్రమే కొత్త భవనాలను నిర్మించుకున్నారు. చాలా తండా పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక పాలన ఉన్నది. ఆర్థిక సంఘం నిధులు రాక నిర్వహణలేకుండా పోయియి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలాచోట్ల డ్రైనేజీలు కూలిపోయి మురుగునీరు రోడ్లపై పారుతోంది. సమయానికి మురుగు తొలగించకపోవడంతో దుర్గంద భరితంగా మారాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద పలు కాలనీలకు సీసీరోడ్లు నిర్మించారు. విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో చాలా కాలనీలు అంఽధకారంలో మగ్గుతున్నాయి. హైమాస్ట్‌ లైట్లు అమర్చినా వాటి నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు. మిషన్‌ భగీరథ నీరు వస్తుండటం కొంత ఊరట కలిగిస్తున్నా.. కొత్తగా ఏర్పాటైన కాలనీల ఇళ్లకు పైప్‌లైన్‌లు వేయకపోవడంతో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇళ్ల మధ్య ముళ్ల చెట్లు, పొదలు పెరిగిపోయాయి. రెండేళ్లుగా వాటిని తొలగించేందుకు కూడా నిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు చేతులెత్తేశారు. వీటివల్ల విషసర్పాలు, దోమలతో పల్లెజనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

ఎన్నికల ప్రచారంలో ఎన్నో సమస్యలు

రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు వేళ్లూనుకున్నాయి. ఎన్నికల వేళ కాలనీలలో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు స్థానికులు వాటిని ఏకరువు పెట్టారు. ముళ్లపొదలు తొలగించడం లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయడం లేదని, రోడ్లు, వీధిదీపాలు లేవని చెప్పుకొచ్చారు. అభ్యర్థులు తాము గెలిచిన వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు గెలిచిన వారు ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొందరు సర్పంచ్‌లు గెలిచిన వెంటనే సొంత డబ్బుతో ఇచ్చిన మాట ప్రకారం లైట్లు వేయించడం, ముళ్ళపొదల తొలగింపు వంటి పనులు మొదలుపెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ప్రస్తుతం పంచాయతీలలో నిధులు ఉండాలి. ఇప్పటికే అన్ని పంచాయతీల ఖజానా ఖాళీ అయ్యింది. 15వ ఆర్థిక సంఘం నిధులకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. సరిగ్గా రెండేళ్ల తరువాత పంచాయతీల పాలక మండళ్లు కొలువు దీరనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు, అనంతరం సమావేశాలు నిర్వహించుకుంటారు. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అందుకోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలన్నీ ముస్తాబు అయ్యాయి.

Updated Date - Dec 21 , 2025 | 11:31 PM