Share News

కుమార్తెతో కనిపించిన యువకుడు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:43 PM

తన కుమార్తెతో ఓ యువకుడు సన్నిహితంగా మాట్లాడుతుండగా తండ్రి చూసి పట్టుకునేందుకు యత్నించాడు.

కుమార్తెతో కనిపించిన యువకుడు

- పట్టుకునేందుకు తండ్రి యత్నం

- తప్పించుకునే యత్నంలో కత్తితో దాడి

- గతంలోనే గ్రామంలో పంచాయితీ

ఊట్కూర్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : తన కుమార్తెతో ఓ యువకుడు సన్నిహితంగా మాట్లాడుతుండగా తండ్రి చూసి పట్టుకునేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో ఆ యువకుడు అతడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన నారాయణపేట జిల్లా, ఊట్కూరు మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. ఊట్కూరు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యువతితో అదే ఊరికి చెందిన జంజర్ల నరేశ్‌ అనే యువకుడు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి మందలించడంతో పాటు గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. అలాంటిది ఏమీ లేదని, కావాలని నిందలు వేస్తున్నారని ఆ యువకుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూసి పట్టుకొని, అప్పుడు చెప్పాలన్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం నరేశ్‌ ఆ యువతితో కలిసి మాట్లాడుతుండగా, ఆమె తండ్రి గమనించి, పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి యత్నించాడు. చేయి అడ్డు పెట్టడంతో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సంఘటనపై శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 11:43 PM