అంతుచిక్కని ఆరుగురి ఆచూకీ
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:48 PM
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం దుర్ఘటన జరిగి సోమవారానికి 59 రోజులు గడిచింది. టన్నెల్లో శిథిలాల తవ్వకాలు రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి.
- షీర్ జోన్‌లో తవ్వకాలపై సందిగ్ధం
- కొనసాగుతున్న నీటి ఊట పంపింగ్
దోమలపెంట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం దుర్ఘటన జరిగి సోమవారానికి 59 రోజులు గడిచింది. టన్నెల్లో శిథిలాల తవ్వకాలు రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. బయటకు తరలింపు చివరి దశకు చేరింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకు రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు అందులో చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదు. షీర్ జోన్‌లో తవ్వకాలు జరిపితే తప్ప వారిని గుర్తించడం కష్టంకాగా, శిథిలాలతో నిండుకున్న 43 మీటర్లలో తవ్వకాలు జరిపే సాహసం చేస్తారా? లేదా ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ఆచూకీ లభించకపోతే బాధిత కుటుంబాలకు జీవితాంతం తీరని శోకం మిగులుతుందని రెస్క్యూ బృందాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 24 వరకు శిథిలాల తరలింపు
మిగిలిన శిథిలాలను ఈ నెల 24 వరకు తరలించి, సొరంగాన్ని శుభ్రం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద ఘటన జరిగిన ఫిబ్రవరి 22 నుంచి నేటి వరకు రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో దేశ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూ బృందాలు, సంస్థలు ఎన్‌డీఆ ర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్, ఎన్‌సీఎస్, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, ఆర్మీ, నేవీ, జీఎస్‌ఐ, జీఎస్‌ఐ, హైడ్రా, సింగరేణీ, దక్షిణ మధ్య రైల్వే, ట్రాన్స్‌కో, స్నిపర్ డాగ్స్, క్యాడవర్ డాగ్స్, ర్యాట్‌హోల్ మైనర్స్, రెవెన్యూ, పంచాయతీరాజ్, జెపీ కంపనీ తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన 8 మంది లో మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గరుప్రీత్ సింగ్, 25న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కు మార్‌ల మృతదేహాలను వెలికి తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదకరంగా పరిగణించిన 43 మీటర్లు మినహా మిగిలిన ప్రాంతంలోని శిథిలాలను రెస్క్యూ బృందాల సభ్యులు పూర్తిగా తిరుగతోడారు. మిగిలిన ఆరుగురు కార్మికుల ఆనవాళ్లు మా త్రం కన్పించలేదు. ఈ క్రమంలో బయట పడిన టన్నుల కొద్దీ బరువున్న బండరాళ్లు, టీబీఎంకు అనుసంధానంగా ఉన్న ఇనపు ఫ్లాట్‌ఫాం శకలాలను రెస్క్యూ బృందాలు ముక్కలుగా కత్తిరించి బయటకు తరలిస్తున్నారు. సొరంగంలోని బురద మట్టిని ఇప్పటికే పూర్తిగా తొలగించారు. మిగిలిన శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ టీం మేనేజర్లు రాజేందర్‌రెడ్డి, మాధవ రావు, ఎన్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, రైల్వే, జీఎస్‌ఐ, ఇరిగేషన్, జెపీ కంపెనీ, ర్యాట్ హోల్ మైనర్స్, వివిధ శాఖ అధికారులు పాల్గొంటున్నారు.