ఎండలు షురూ
ABN , Publish Date - Mar 12 , 2025 | 10:48 PM
వేసవి వచ్చేసింది.. మార్చి రెండో రావడంతో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పగలంతా ఎండ, ఉక్కపోత ఉండగా, తెల్లవారుజామున చల్ల గాలులు వీస్తున్నాయి.. మరో వారం, పది రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగనున్నాయి.

రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫుట్‌పాత్ వ్యాపారులకు మొదలైన వేసవి కష్టాలు
ట్రాఫిక్ పోలీసులకు తప్పని తిప్పలు
మహబూబ్‌నగర్, మార్చి 12 (ఆంఽధజ్యోతి): వేసవి వచ్చేసింది.. మార్చి రెండో రావడంతో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పగలంతా ఎండ, ఉక్కపోత ఉండగా, తెల్లవారుజామున చల్ల గాలులు వీస్తున్నాయి.. మరో వారం, పది రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగనున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో కూలర్లు, ఏసీలు, టేబుల్ ఫ్యాన్ల విక్రయాలు పెరిగాయి. ఒక్కో ఏసీ సర్వీసింగ్‌కు రూ.500-800 వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఫోన్ చేసిన మూడు, నాలుగు రోజులకు మెకానిక్‌లు వస్తున్నారు. జిల్లా కేంద్రంలో పేరుపొందిన 2-3 దుకాణాలనుంచి ప్రతిరోజు 6-8 ఏసీల విక్రయాలు సాగుతున్నాయి. వాహనదారులు ఎండలకు చాలావరకు తమ ప్ర యాణాలు తగ్గించు కుంటున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రంతో పాటు, జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఫుట్‌పాత్ వ్యాపారుల అవస్థలు
అప్పన్నపల్లి నుంచి బండమీదిపల్లి వరకు ప్రధాన రహదారిపై, గడియారం చౌరస్తా, పాన్‌చౌరస్తాలో ఫుట్‌పాత్ వ్యాపారం చేసుకునే వారు, ట్రాఫిక్ పోలీసులు ఎండలకు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగు నీడన వ్యాపారం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో 12-14 పాయింట్లలో ట్రాఫిక్ పోలీసులు ఎండలోనే రోజంతా నిలబడి ట్రాఫిక్‌ను నియింత్రించాల్సి ఉంటుంది.
పానీయాలతో ఉపశమనం
ఎండలో బయట తిరిగేవాళ్ళు దాహార్తిని తీర్చుకునేందుకు రోడ్లపై విక్రయించే కొబ్బరి బోండాలు, చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగలతో తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున పానీయాల విక్రయాలు సాగుతున్నాయి. చెరుకు రసం బండ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలానే సొడా, మజ్జిగ కేంద్రాలు వెలిశాయి.