Share News

వ్యక్తి నిర్మాణంతోనే రాష్ట్ర నిర్మాణం

ABN , Publish Date - May 11 , 2025 | 11:25 PM

వ్యక్తి నిర్మాణంతోనే రాష్ట్ర నిర్మాణం అవుతుందని వందేళ్ల క్రితమే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేశవరావు బాల్‌రాం హెగ్డేవర్‌ వెల్లడించారని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ ఉప్పలంచ మల్లిఖార్జున్‌ అన్నారు.

వ్యక్తి నిర్మాణంతోనే రాష్ట్ర నిర్మాణం
కవాతు నిర్వహిస్తున్న శిక్షార్థులు

- ముగిసిన సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం

జడ్చర్ల, మే 11 (ఆంధ్రజ్యోతి) : వ్యక్తి నిర్మాణంతోనే రాష్ట్ర నిర్మాణం అవుతుందని వందేళ్ల క్రితమే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేశవరావు బాల్‌రాం హెగ్డేవర్‌ వెల్లడించారని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ ఉప్పలంచ మల్లిఖార్జున్‌ అన్నారు. జడ్చర్ల పట్టణ శివారులోని స్వామి నారాయణ గురుకులం పాఠశాలలో సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తగా మల్లిఖార్జున్‌ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఇంటర్నెట్‌ కాలంలో కుటుంబ, జీవన విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బలవంతంగానైనా హిందుత్వం, భగవద్గీతలను బట్టి పట్టించాలని పిలుపునిచ్చారు. దేశ హితం కోసమే వందేళ్ల క్రితం ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పనిచేస్తుందన్నారు. చైనా, పాకిస్థాన్‌తో జరిగిన యుద్దంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పనిచేసారన్నారు. 800 సంవత్సరాల క్రితం దురాక్రమణదారుల కారణంగా కులవివక్ష పేరుతో, సమాజాన్ని పీడిస్తున్న అంటరాని తనం అనేది ఇక చెల్లదని స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య రంగంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో భారతదేశం నిలిచిందన్నారు.

ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షార్థుల కవాతు..

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవ ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షార్థుల కవాతు అందరినీ ఆకట్టుకుంది. వర్షంలోనే శిక్షార్థులు కవాతు నిర్వహించారు. 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో 287 ప్రాంతాల నుంచి 388 మది శిక్షార్థులు పాల్గొన్నారని వర్గ సర్వాధికారి పాలేటి వెంకట్రావు వెల్లడించారు. వీరికి 37 మంది శిక్షకులు శిక్షణ ఇచ్చారని, వీరికి మరో 74 మంది సహయం అందించారని తెలిపారు. జడ్చర్ల మండలం గంగాపురం మళయాలస్వామి లక్ష్మినారాయణ ఆశ్రమ పీఠాధిపతులు ఆచార్య పరమాత్మ ఆనందగిరిస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు డాక్టర్‌ భరద్వాజ్‌ నారాయణరావు, ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ బర్ల సుందర్‌రెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, స్వామి నారాయణ గురుకుల పాఠశాల అధిపతి సర్వదర్శన్‌ స్వామీజీ, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ నాయకులు పాండురంగారెడ్డి, శ్రీవర్దన్‌రెడ్డి, ముచ్చర్ల కృష్ణయ్య, ఎడ్ల బాలవర్దన్‌గౌడ్‌, సాహితిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:25 PM