Share News

‘పారిశుధ్యం’లో అవినీతి కంపు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:31 PM

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ అవినీతి కంపులో కూరుకుపోయింది.

‘పారిశుధ్యం’లో అవినీతి కంపు

- 204 మందికి గాను, 160 మందితో వెట్టి చాకిరీ

- దాదాపు 40 మంది లేకున్నా ఉన్నట్లు చూపిస్తున్న పరిస్థితి

- అగ్రిమెంట్‌ నిబంధనలకు శ్రీసాయి ఏజెన్సీ తిలోదకాలు

- మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఇదీ దుస్థితి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) సెప్టెంబర్‌ 23 (ఆంద్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ అవినీతి కంపులో కూరుకుపోయింది. పారిశుధ్య నిర్వహణ టెండరును దక్కించుకున్న శ్రీసాయి ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్‌లో పొందుపరిచిన నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం 204 మందిని నియమించాల్సి ఉంది. కానీ 160 మందినే నియమించుకొని వారితో వెట్టిచాకిరీ చేయిస్తోంది. కానీ కార్మికులు పూర్తి స్థాయిలో ఉన్నట్లు రిజిస్టర్‌లో చూపిస్తూ ఆసుపత్రి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు దండుకుంటోంది. అంతే కాకుండా దాదాపు 16 మందికి నిబంధనలకు విరుద్ధంగా జీతాలు ఇస్తోంది. దీంతో పాటు 40 మంది వరకు ఎక్కువగా చూపించి వారి వేతనాలను కూడా స్వాహా చేస్తోంది. జనరల్‌ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ ఏజెన్సీ అవినీతి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం...

450 పడకలకు టెండరు

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 450 పడకలకు పారిశుధ్య నిర్వహణ టెండర్లను శ్రీసాయి ఏజెన్సీ దక్కించుకున్నది. గత ఏడాది 2022 జూన్‌ నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది. ఏజెన్సీ నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ బెడ్డుకు నెలకు రూ. 7,500 చొప్పున రూ.33.75 లక్షలు చెల్లిస్తోంది. ఇందులో సూపర్‌వైజర్లు, పేషెంట్‌ కేర్‌ అటెండర్లు, సెక్యూరిటీ, స్వీపర్లను నియమించుకొని పనులు చేయించాల్సి ఉంటుంది. ప్రతీ నెల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వారి పనికి సంతృప్తి చెంది ఆమోదిస్తేనే ఆ బిల్లు వస్తుంది.

ఆసుపత్రిలో 650 పడకలు

జనరల్‌ ఆసుపత్రిలో కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వాస్తవానికి 450 పడకలు ఉండాలి. కోవిడ్‌ తర్వాత అదనంగా 200 పడకలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 650 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం పని చేస్తున్నవారి సంఖ్య 160 మందికి లోపే ఉంటోంది. సూపర్‌వైజర్లు 15, సెక్యూరిటీ సిబ్బంది 40, పేషెంట్‌ కేర్‌ అటెండర్లు 40 మంది కాగా, మిగతా వారు స్వీపర్లుగా పని చేస్తున్నారు. వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో దాదాపు 30కి పైగా వార్డులు, ఎంసీహెచ్‌ భవనం ఉండగా, 60 నుంచి 80 మంది స్వీపర్లతోనే పని చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రతీ రోజు 500 నుంచి 600 వరకు అడ్మిషన్‌ రోగులే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వార్డులన్నీ శుభ్రం చేసేందుకు రోజంతా పడుతోంది. పేషెంట్‌ కేర్‌ అటెండర్ల సంఖ్య కూడా వస్తున్న రోగులకు సరిపోవడం లేదు. రోగి వెంట వచ్చే బంధువులు, కుటుంబ సభ్యులే వీల్‌చైర్లు, తోపుడు బండ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. వార్డులు కూడా కంపుకొడుతున్నాయి. ఆసుపత్రి పరిసరాలు కూడా అధ్వాన్నంగా మారాయి.

ఏజెన్సీ నిర్వాహకుల ఇష్టారాజ్యం

ఏజెన్సీ నిర్వాహకులపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి ఇచ్చిన ఒప్పంద పత్రంలో 204 మంది పారిశుధ్య కార్మికులను తీసుకున్నట్లు చూపించారు. కాని అక్కడ పనిచేస్తున్నది మాత్రం కేవలం 160 మందే. ఇంకా 44 మంది తక్కువగానే ఉన్నారు. వారిలోనూ ప్రతీ రోజు 140 నుంచి 160 మంది వరకే పని చేస్తున్నారు. కానీ 204 మంది లెక్కన బిల్లులు తీసుకుంటున్నారు. బోగస్‌ పేర్లతో సంతకాలు చేసి నెల నెల బిల్లులు తీసుకుంటున్నారు. ఇలా లెక్కలో లేని 44 మందికి గానూ రూ. 5.80 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకులు దండుకుంటున్నారు.

మరో 16 మందికి ఏజెన్సీ నుంచే జీతం

పారిశుధ్య కార్మికుల పేరు మీద మరో 16 మందిని నియమించుకొని వారితో ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో పని చేయిస్తున్నారు. కానీ వారికి ఏజెన్సీ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. వారి పని తీరు బాగా ఉందని అధికారులు ‘సాటిస్పై సర్టిఫికెట్‌’ ఇవ్వకపోయినా రాష్ట్రస్థాయి ప్రజా ప్రజాప్రతినిధులతో ఒత్తిడి చేయించి బిల్లులు చేయించుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులతో ఆసుపత్రి అధికారులు కూడా కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి వార్డుల వారిగా నర్సింగ్‌ సిబ్బంది, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు కూడా 70 శాతం పని తీరు మాత్రమే ఇస్తున్నారు. కాని ఆసుపత్రి ఉన్నతాధికారుల కార్యాలయానికి వచ్చే సరికి అది 95 శాతానికి మారిపోతోంది. ఫలితంగా ఏజెన్సీ వారికి దాని ప్రకారమే బిల్లులు వస్తున్నాయి.

పూర్తి స్థాయిలో పరిశీలిస్తాను

సూపరింటెండెంట్‌గా ఇటీవలే చార్జ్‌ తీసుకున్నాను. ఒప్పందం ప్రకారం 204 మంది కార్మికులు ఉండాలి. కానీ తక్కువగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారికోసం బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తున్నాను. దీని వలన ఎంత మంది ఉన్నారు, వారిలో ఎంత మంది పనిచేస్తున్నారో తెలుస్తుంది. దాని ప్రకారమే ప్రతినెల సాటిస్పై సర్టిఫికెట్‌ ఇస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి అగ్రిమెంట్‌లోని అంశాలపై చర్చిస్తాను.

- డా. రంగా అజ్మీర, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌.

Updated Date - Sep 23 , 2025 | 11:31 PM