పరిష్కారమే తరువాయి
ABN , Publish Date - May 12 , 2025 | 10:38 PM
గత ప్రభుత్వంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేసి, భూ భారతి పోర్టల్‌ను రైతులకు ఉపయోగకరంగా తెస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ భారతి చట్టం చేసి, ధరణి పేరును కూడా మార్చింది. అయితే ఇంకా పాత పోర్టల్ మాడ్యూల్స్ ప్రకారమే రిజిస్ర్టేషన్ ప్రక్రియ సాగుతోంది. కొత్త పోర్టల్ ప్రారంభించలేదు.
పూర్తయిన దరఖాస్తుల పరిశీలన
కక్షిదారులందరికీ నోటీసులు జారీ..
10 రోజుల్లోగా వివరణ కోరిన అధికారులు
ఈ నెల 20 వరకు పరిష్కరించేందుకు మండలంలో 7 బృందాల ఏర్పాటు
ఒక్కో బృందంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్
మహబూబ్‌నగర్, మే 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గత ప్రభుత్వంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేసి, భూ భారతి పోర్టల్‌ను రైతులకు ఉపయోగకరంగా తెస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ భారతి చట్టం చేసి, ధరణి పేరును కూడా మార్చింది. అయితే ఇంకా పాత పోర్టల్ మాడ్యూల్స్ ప్రకారమే రిజిస్ర్టేషన్ ప్రక్రియ సాగుతోంది. కొత్త పోర్టల్ ప్రారంభించలేదు. గత ప్రభుత్వం ధరణిని ప్రారంభించిన సమయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో తెలుసుకో లేదు. చట్టంపై అవగాహన కల్పించకుండా సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా ఒక కొత్త మాడ్యూల్‌ను తేవడంతో అనేక విమర్శలను ఎదుర్కొంది. అలాగే స్థానికంగా ఉండే ఆర్డీవో, జేసీ కోర్టులను రద్దు చేయడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలను పోర్టల్‌లలో పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గత నెలలో 17వ తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్‌లో భూ భారతి సదస్సును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆ రోజు నుంచి 30వ తేదీ వరకు మండల ప రిధిలోని 17 రెవెన్యూ గ్రామాల్లో రైతుల నుంచి సమస్యలపై అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులు పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ లోపే పైలట్ మండలాల్లో వచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంది.
1,341 ఫిర్యాదులు
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మద్దూరు మండలంలో 14 రోజుల పాటు 17 రెవెన్యూ గ్రామాల్లో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా, 1,341 దరఖాస్తులు వచ్చాయి. అందులో 902 సర్వే నెంబర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అత్యధికంగా సర్వే నెంబర్ల తప్పులకు సంబంధించి 491 ఫిర్యాదులు రాగా, కొత్త పాసు పుస్తకాలకు సంబంధించి 11, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులకు సంబంధించి 231, నేచర్ ఆఫ్ ల్యాండ్, టైప్ ఆఫ్ ల్యాండ్‌కు సంబంధించి 20, పట్టాదారు సమస్యకు సంబంధించి 21, నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సంబంధించి 28, సాదా బైనామాలకు సంబంధించి 113, అసైన్డ్ భూముల సమస్యలపై 96, సర్వే నెంబర్ సబ్ డివిజన్ సమస్యలపై 50, ఇతర ఫిర్యాదులు 281 వరకు వచ్చాయి. అందులో ఒఆర్‌సీ, తల్లిదండ్రుల పేరు మార్పు, ఏం పద్ధతిలో భూమి సంక్రమించిందనే విషయాలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నెల మొదటి వారం నుంచే వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి అధికారులు పరిశీలన చేపట్టారు. సమస్య సరైనదేనా?, పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయా? లేదా అనే విషయాలను పరిశీలించారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులకు నోటీసులు కూడా అందజేశారు. 10 రోజుల్లోగా సమస్యపై వివరణ కూడా కోరారు.
20లోగా పరిష్కారం
భూ భారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం మద్దూరులో వచ్చిన ఫిర్యాదులను ఈనెల 20వ తేదీలోగా పరిష్కరించాలని అధికారులు లక్ష్యం నిర్ణయించుకున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు పైలట్ మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసి, ఫిర్యాదులు స్వీకరించగా, ఇప్పుడు జిల్లాకు పైలట్ మండలంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మద్దూరులో చేసిన విధానాన్ని ప్రామాణికంగా తీసుకుని మిగతా మండలాల్లో కూడా అమలు చేయనున్నారు. జూన్ 2 నాటికి అన్ని పైలట్ మండలాల్లో సమస్యలు పరిష్కరించి, నూతన పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నారు. భూ భారతి అవగాహన సదస్సుల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 100 మంది సర్వేయర్లను నియమించి, భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పైలట్ మండలం మద్దూరులో 1,341 ఫిర్యాదుల పరిష్కారానికి 7 బృందాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ నియమించారు. ఒక్కో బృందంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఒక సర్వేయర్ ఉంటారు. వీరు పరిశీలించిన 1,341 ఫిర్యాదులకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి, అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపనున్నారు. సమస్య సరైనది కాకపోయిన, వివాదాస్పదమైన విషయాలను రిపోర్టుగా తయారు చేసి, అధికారులకు నివేదిస్తారు. ఆ తరువాత వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాదాబైనామాలకు సంబంధించి కాస్తులో ఉన్నారా? లేదా? అనేది పరిశీలించడంతో పాటు చుట్టుపక్కల భూముల వారితో విచారణ చేస్తారు. తరువాత సాదాబైనామాలను కూడా పరిశీలించి, తరువాత పట్టాదారు పాసు బుక్కు అందజేసే అవకాశం ఉంది.
పది రోజుల్లో భూసమస్యల పరిష్కారం
భూ భారతి కొత్త చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్ట్టు కింది ఎంపికైన మద్దూర్ మండలంలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 1,341 దరాఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. దరఖాస్తుదారులకు నోటీసులు కూడా అందించాం. జిల్లా అధికారుల ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 కమిటీలు క్షేత్రస్థాయికి వెళ్లి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయి. ఈ నెల 20లోపు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
- జయరాములు, ఇన్‌చార్జి తహసీల్దార్, మద్దూర్