Share News

జర్నలిస్టుల పాత్ర కీలకం

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:18 PM

ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజంశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

జర్నలిస్టుల పాత్ర కీలకం
నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- నాగర్‌కర్నూల్‌లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభ

- ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌టౌన్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజంశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గోలి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ జిల్లా మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన జర్నలిస్టులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కాని కొందరు జర్నలిస్టులు ఆర్ధికంగా ఉన్నా, ఇళ్ల స్థలాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ కత్తి కంటే కలం గొప్పదని, రాజకీయాల్లోకి వచ్చాకే జర్నలిస్టుల విలువ తెలిసిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చేందుకు తన వంతుగా సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్‌, జిల్లా, అసెంబ్లీ, మండల యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 11:20 PM