జడ్చర్ల బైపాస్ రోడ్డుకు మార్గం సుగమం
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:56 PM
జడ్చర్ల పట్టణంలో జాతీయ రహదారులు 44, 167 అనుసంధానం ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. అందుకు సంబంధించి డీపీఆర్ రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీని ఆదేశించామని, నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ లేఖ రాశారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంజూరుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం
డీపీఆర్ రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీకి ఆదేశం
ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు ఇస్తామని లేఖ
వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల పట్టణంలో జాతీయ రహదారులు 44, 167 అనుసంధానం ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. అందుకు సంబంధించి డీపీఆర్ రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీని ఆదేశించామని, నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ లేఖ రాశారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మేలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి షాద్‌నగర్ ప్రాంతంలో బైపాస్ రోడ్డు కోసం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి వినతి పత్రం ఇచ్చానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటీవల మరో పర్యాయం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసి, విజ్ఞప్తి చేశానన్నారు. అందుకుకు సుముఖత వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి తాజాగా మంజూరు చేస్తున్నామని, అందుకు సంబంధించి చర్యలు చేపడ్తున్నట్లు లేఖ పంపించారని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో జడ్చర్ల పట్టణం మరింత విస్తరించడంతో పాటు పట్టణ ప్రగతి పరుగులు పెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు మంజూరుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నంశ్రీనివా్‌సరెడ్డిలకు ధన్యావాదాలు తెలిపారు.