రహదారి రక్తసిక్తం
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:22 PM
జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
- రెండు ఆటోలు ఢీ, ముగ్గురు వ్యక్తుల దుర్మరణం
- మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గర దగ్గర ఘటన
భూత్పూర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామ శివారులో నాగకర్నూల్ జాతీయ రహదారిపైన గురువారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం దొంతికుంట తండాకు చెందిన పాత్లావత్ సక్రీ(36), అదే మండలంలోని గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన గుంపల్లి వంశీ(23), మహబూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మండలంలోని పోతులమడుగు గ్రామానికి చెందిన సౌదరి నర్సిహారెడ్డి (57) కలిసి ఖిల్లాఘనపూర్ నుంచి ఆటోలో భూత్పూర్‌కు బయలుదేరారు. కొత్తమొల్గర గ్రామ శివారులోని తుల్జాభవానీ తండా దగ్గర భూత్పూర్ నుంచి బిజినేపల్లి వైపునకు కిరాణ సామానులతో వెళుతున్న మరో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆ రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఘనపూర్ నుంచి భూత్పూర్‌కు వెళుతున్న ఆటోలో నలుగు ప్రయాణికులు ఉన్నారు. వారిలో వంశీ, నర్సింహారెడ్డి సంఘటనా స్థలంలోనే తలలు పగిలి మృతి చెందారు. పాత్లావత్ సక్రీ అనే మహిళను చికిత్స కోసం ఆంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే మృతురాలు సక్రీ కి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఒక కూమారుడు ఉన్నారు. ఆమె తన ఇద్దరు కూతుళ్లను జడ్చర్లలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివిస్తోంది. దసర పండుగ సెలవుల సందర్భంగా పిల్లలిద్దరినీ తీసుకురావడానికి వెళుతూ మృతి చెందింది. అదే విధంగా వంశీ అనే యువకుడు ఖిల్లాఘనపూర్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. భూత్పూర్‌కు వస్తుండగా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉండే నర్సిహారెడ్డి సొంత పనుల నిమిత్తం ఖిల్లాఘనపూర్‌కు వచ్చి వెళుతుండగా మృతి చెందాడు. అతని భార్య రెండు సంవత్పరాల క్రితం ఆనారోగ్యంతో మృతి చెందింది. ఒక కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న భూత్పూర్ ఎస్‌ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘనకు సంబంధించిన రెండు ఆటోల డ్రైవర్లు ఫారారైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నాగకర్నూల్ జాతీయ రహదారి రక్తంతో తడిసి మద్దైపోయింది. మృతుల బందువుల ఫిర్యాదు మేరకు అజాగ్రత్తగా ఆటో నడిపి ప్రమాదానికి కారణం అయిన ఘనపూర్‌కు చెందిన బద్గని నర్సిములుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ తెలిపారు.